దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఇది తెలుగు వారందరికీ గర్వకారణం. తెలుగు నాట తొలి ప్రధాని.. తొలి నెహ్రూ, గాంధీ కుటుంబేతర ప్రధాని అయిన పీవీకి భారతరత్న ప్రకటించడం పట్ల పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం స్పందించేందుకు నిరాకరించారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పీవీకి భారతరత్న ఇవ్వడం కాంట్రవర్సీ అంశమేమీ కాదు. ప్రజలు, పార్టీలన్నీ స్వాగతిస్తున్న అంశం. మరి జగన్ ఎందుకు స్పందించలేదు? అనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ నేతగానే చూస్తున్నారా?
పీవీకి భారతరత్న పురస్కారం ప్రకటించిన సమయంలో జగన్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సమావేశానంతరం మీడియా ఆయనను మీ తెలుగు వ్యక్తికి పురస్కారం లభించడంపై మీ స్పందనేంటని అడిగింది. దీనికి జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరికదా.. చేతులు జోడించి దణ్ణం పెట్టి మరీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మన జగనన్న వ్యవహరించిన తీరుకు జాతీయ మీడియా అవాక్కైంది. పీవీ గురించి మాట్లాడటానికి ఎందుకు జగన్ ఇష్టపడలేదనేది చర్చనీయాంశంగా మారింది. పీవీని కాంగ్రెస్ నేతగా మాత్రమే జగన్ చూస్తున్నారా? అందుకే మాట్లాడలేదా?
మంచి అవకాశం కోల్పోయిన జగన్..
ప్రధాని మోదీ ఏమైనా జగన్‌కు చివాట్లు పెట్టారా? అందుకే చిరాకులో ఉండి మాట్లాడలేదా? అసలెందుకు జగన్ స్పందించలేదని మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. మోదీ ఫైర్ అయి ఉంటే ఆ అసహనమో.. లేదంటే పీవీ గురించి తెలియకో ఆయన మాట్లాడలేదని టాక్. నిజానికి జగన్.. పీవీ గురించి మాట్లాడి ఉంటే.. ఆయన గౌరవం పెరిగి ఉండేది. ఒకరకంగా జగన్ మంచి అవాకాశాన్ని కోల్పోయారు. అలాగే ప్రజల దృష్టిలో కూడా ఆయన కాస్త గొప్పగా కనిపించేవారు. అసలే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వస్తే స్పందించలేదన్న కోపం జనాల్లో జగన్‌పై ఉంది. ఇప్పుడు పీవీ విషయంలో స్పందించి ఉంటే ఆ కోపం కొంత తగ్గి ఉండేది. మెగాస్టార్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అన్నగానూ.. పీవీని కాంగ్రెస్ నేతను చూస్తున్నారేమో.. అందుకే ఆయన మాట్లాలేదేమోనని జనం భావిస్తున్నారు.