అడ్వాణీ.. పీవీకి సరే.. అన్నగారికేదీ భారతరత్న?
భారతరత్న.. భారతరత్న.. ఇప్పుడు గల్లీ నుంచి ప్రపంచం మొత్తం మాట్లాడుకునే మాట ఇదే. మునుపెన్నడూలేని విధంగా 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ అవార్డులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా.. ఏం చేసైనా సరే గెలవాలని టార్గెట్‌తో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే అసలు అద్వానీని ఇన్నిరోజులూ లెక్కజేయని మోదీ.. ఇప్పుడు భారతరత్న ప్రకటించడం ఆ తర్వాత శుక్రవారం నాడు తెలుగు ఠీవీ పీవీ నర్సింహారావుకూ ఇస్తున్నట్లు ప్రకటించడంతో మరోసారి అన్నగారు, సినిమా, రాజకీయాల్లో విశిష్ట సేవలు అందించిన నందమూరి తారకరామారావు పేరు తెరపైకి వచ్చింది. మోదీ హయాంలో మొత్తం 10 మందికి ఈ అత్యున్నత పురస్కారాలు ప్రకటించినప్పటికీ ఎక్కడా ఎన్టీఆర్ పేరు లేదు.. కనీసం పెద్దాయనను పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.
ఇదేం న్యాయం..?
చూశారుగా మోదీ.. ఎంతసేపూ ఈ అవార్డులను ఎన్నికల స్టంట్‌గా మార్చుకుని తమకు కావాల్సిన, బీజేపీని ఇక్కడిదాకా తీసుకొచ్చిన వారికి ఇచ్చారే తప్ప.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు, ఈ తరం రాజకీయ నేతలు కూడా ఊహించనన్ని మార్పులు, చేర్పులు చేసిన ఎన్టీఆర్ పేరును మరిచిపోవడం సిగ్గుచేటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అద్వాణీకి ఇచ్చారు.. పీవీకి సరే ఇక అన్న గారి సంగతేంటి..? అనే మిలియన్ డాలర్ల ప్రశ్న మోదీ ముందుంది. రాజకీయాలకు అతీతంగా అవార్డులు ప్రకటించారని చెప్పుకుంటున్న ప్రధాని ఏ మేరకు న్యాయం చేశారన్నది ఇప్పుడు సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ అడుగుతున్న ప్రశ్న. ఎలాగో రానున్న ఎన్నికల్లో గెలుపుకోసం కర్చీఫ్ వేసి మరీ ఇచ్చిన ప్రధాని.. ఎన్టీఆర్‌ను గుర్తించలేదు.. అప్పుడుప్పుడు పెద్దాయన పేరు పార్లమెంట్‌లో స్మరించుకోవడం కాదు.. ఆయన చేసిన సేవలను కూడా గుర్తిస్తే మంచిదని మోదీకి సూచిస్తున్నారు సామాన్యులు.
బాధ్యత ఎవరిది..?
ఎన్టీఆర్‌కు మోదీ భారతరత్న ప్రకటించలేదు.. సరే.. ఈ ప్రకటన వచ్చేంతవరకూ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉందా..? లేదా..? అంటే వందకు వెయ్యి శాతం ఉంది. మరోవైపు.. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలోనే.. అది కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు బీజేపీతో పొత్తు పెట్టుకుని.. ప్రపంచ వ్యాప్తంగా తనకు పరిచయాలున్నాయని.. చెప్పుకునే చంద్రబాబు ఉన్నారు.. మరి వీళ్లంతా ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు ప్రతి తెలుగోడి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎన్నికలప్పుడు.. ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి రోజున మాత్రమే అన్నగారు గుర్తొస్తారా..? మిగిలిన రోజుల్లో కనీసం ఇలా అవార్డులు ప్రకటించిన సందర్భాల్లో కూడా గుర్తుకు రారా..? ఎందుకింత వివక్షత..? ఇదేమైనా న్యాయమేనా..?. ఏదో అప్పుడప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. అని కుహనా నేతల నోట వస్తుందే కానీ.. గట్టిగా పట్టుబట్టరేం..? కనీసం ఇందుకు కావాల్సిన కార్యాచరణ ఒక్కరూ చేయరేం..? అంటే పెద్దాయన ఎన్నికలకు మాత్రమే అస్త్రమా.. ఇలాంటి వాటికి కాదా..? ఇకనైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. నందమూరి కుటుంబ సభ్యులు.. మరీ ముఖ్యంగా చంద్రబాబు, పురంధేశ్వరి మొద్దు నిద్ర మాని భారతరత్న డిమాండ్ చేయడం కాదు.. వచ్చేంతవరకూ పోరాటం చేసి.. ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అడుగు వేయాల్సింది అభిమానులే
అన్నగారి మీద అభిమానం అంటే బ్యానర్లు కట్టడం కాదు, ఫ్లెక్సీలు పెట్టడం కాదు. ఆ మహనీయుని శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించేశామని గర్వంగా జబ్బలు చరుచుకోవడమో కాదు. ఆయన స్మృతి చిహ్నంగా వెలువడిన నాణేలను తెచ్చి భద్రంగా దాచుకోవడమో కాదు. ఆయనకు దక్కాల్సిన గౌరవం, ఇవ్వాల్సిన గుర్తింపు ఇచ్చేదాకా, వచ్చేదాకా.. నిలబడాలి, నినదించాలి. తెలుగు రాష్ట్రాల్లో తిరిగే ఎన్నో లక్షల వాహనాలపై ఆయన స్టిక్కర్ ని ముద్రించుకునే ప్రతి అభిమాని ఆయనకు చెందాల్సిన బిరుదుని అందించాలని గట్టిగా అనుకుంటే అది పెద్ద విషయమేమికాదు. అనుకోవాలంతే.. అభిమానులూ అనుకుంటారా.. అడుగు వేస్తారా.!