బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందంటే దానికి కారణం కేసీఆర్ సహా పార్టీ నేతల అహంభావమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం చేసినా తమకు ఎదురు లేదన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఇక ఎప్పటికీ తెలంగాణలో తమదేనన్న భ్రమలో ఉండిపోయారు. ఈ క్రమంలోనే వారు చేసిన ఓ పని ఓ ఐఏఎస్ అధికారి మెడకు చుట్టుకుంది. ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఏమీ లేకున్నా కూడా ఫార్ములా ఈ -రేస్ కోసం రూ.54 కోట్ల జనం సొమ్మును ధారాదత్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందన్న ధీమాతో అప్పటి మంత్రి కేటీఆర్ ఒక మాట చెప్పగానే సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అర్వింద్ కుమార్ రూ.54 కోట్లు రిలీజ్ చేశారు.
కాంట్రాక్ట్ రద్దు చేసుకోలేదు..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి రూ.54 కోట్ల దుర్వినియోగంపై వివరణ కోరుతూ 9 ప్రశ్నలతో కూడిన నోటీసు ఇచ్చారు. దీనికి అర్వింద్ కుమార్ వివరణ ఇచ్చారు. ఇంకా మొదలు పెట్టని రేస్ కోసం అడ్వాన్స్‌గా రూ.54 కోట్లు ఇచ్చినట్టుగా అర్వింద్ కుమార్ అంగీకరిస్తూ సీఎస్‌కు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్‌లను తొలుత గ్రీన్ కో సంస్థకు చెందిన ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించేది. అయితే తమకు నష్టం వచ్చిందని తాము తప్పుకుంటున్నట్టు ఈ సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలిపింది. అయినా కూడా ఇప్పటి వరకూ ఆ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోలేదని అర్వింద్ కుమార్ తెలిపారు. కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏను ఈ రేస్‌లో ప్రమోటర్‌గా దించి.. రూ..54 కోట్ల చెల్లింపులు చేసినట్టు తెలిపారు.
కేటీఆర్‌పై కేసులు పెడుతుందా?
ఈ చెల్లింపులన్నింటినీ నేరు హెచ్ఎండీఏ నుంచి చెల్లించినందున ఆర్థిక శాఖ పర్మిషన్ కానీ ప్రభుత్వ అనుమతి కానీ తీసుకోలేదని అర్వింద్ కుమార్ తెలిపారు. ఈ వ్యవహారమంతా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే జరిగిందని వివరించారు. ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి కోడ్ అమల్లో ఉందన్న విషయం తెలిసి కూడా ఎలా చెల్లింపులు చేశారంటే మాత్రం ఆయన నుంచి సమాధానం రాలేదు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమమైతే ఈ వ్యవహారంపై చాలా సీరియస్‌గా ఉంది. మరి ఇప్పుడు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందా? లేదంటే మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసులు పెడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే ఇది మాయని మచ్చే అని చెప్పాలి.