ఏపీపై బీజేపీకి ఏమాత్రం పట్టులేదు. ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే. అలాంటిది.. అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు ఎదురెళ్లి మరీ మీకు కొన్ని సీట్లిచ్చి గెలిపిస్తామని బంపరాఫర్ ఇస్తున్నారు. ఏపీలో బీజేపీకి టైం బీభత్సంగా కలిసి వస్తున్నట్టే లెక్క. కానీ తెలంగాణలో పరిస్థితులు వేరు. ఇక్కడ బీజేపీకి అంతో ఇంతో పట్టుంది. ఒకానొక టైంలో అయితే టాప్ 2 ప్లేస్‌లో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. ఆ తరువాత ఒక్కాసారిగా బీజేపీ పతనం.. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ప్రారంభమైంది. అంతే బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోగా.. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది.
ఎవరికి వారే.. యమునా తీరే..
ఆసక్తికర విషయం ఏంటంటే.. బీజేపీ ఓటు బ్యాంకు పెరిగింది. కీలక నేతలంతా ఓటమి పాలయ్యారు. ఇక తరువాత రాష్ట్రంలో బీజేపీ ఉందా? లేదా? అన్నట్టుగా తయారైంది పరిస్థితి. బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ అసెంబ్లీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తమ కార్యాచరణను బీజేపీ నేతలు రూపొందించుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ అంతా కలిసి వస్తేనా? ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్టుగా ఉంది వ్యవహారం. సీనియర్ నేత రామచంద్రరావు నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా గత రాత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీనియర్ నేత రాజాసింగ్ హాజరు కాలేదు. ఇక కొందరు ఎమ్మెల్యేలు మాత్రం వర్చువల్‌గా హాజరయ్యారు.
ఫ్లోర్ లీడర్ లేకుండానే అసెంబ్లీకి..
అయితే ఎన్నికల అనంతరం బీజేపీ అధిష్టానం తెలంగాణను పూర్తిగా విస్మరించింది. పోనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనా పట్టించుకోవాలి కదా.. ఆయన కూడా లైట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకూ బీజేపీ ఫ్లోర్ లీడర్‌ను నియమించిన పాపాన పోలేదు. శాసనసభ పక్షా నేత లేకుండానే అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరవుతుండటం గమనార్హం. అయితే ఈ పదవి కోసం మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు పరస్పరం పోటీ అయితే పడుతున్నారు. అధిష్టానం చూస్తే అసలు పట్టించుకోవడం లేదు. దీంతో పార్టీ నేతల్లో సమన్వయం కొరవడింది. ఎవరి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటున్నారు. మరి ఈ తరుణంలో ఇరిగేషన్, బడ్జెట్‌పై అసెంబ్లీలో తమ వాయిస్‌ను గట్టిగా వినిపించాలని అయితే అనుకుంటున్నారు కానీ పార్టీ నేతలంతా కలిసొస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.