ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా పూర్తైందని టాక్. ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టుబట్టి మరీ 38 సీట్లు లభించినట్టు టాక్. అయితే అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇక టీడీపీ, జనసేనలతో పాటు బీజేపీ కూడా చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తినకు వెళ్లారు. బీజేపీ అధిష్టానంతో ఆయన భేటీ కానున్నారు.
పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా..
అసలే జనసేనతో పొత్తు కారణంగా 38 సీట్లు పార్టీ నష్టపోయింది. ఇక ఈ స్థానాల్లో టీడీపీ తమ నేతలకు సర్ది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది కాస్తంత కష్టతరమైన పనే. ఇక ఇది చాలదన్నట్టు బీజేపీ కూడా వచ్చి పొత్తులో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక ఆ పార్టీకి ఎన్ని సీట్లు పోతాయనేదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తమతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా.. ఎన్నికల్లో మాత్రం టీడీపీ, జనసేనలకు సహాయ సహకారాలైతే అందించాలని చంద్రబాబు బీజేపీని కోరనున్నారు. అయితే చంద్రబాబు ఢిల్లీ రాకకు పూర్వమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ పార్టీకి చెందిన ఏపీ నేతలతో సమావేశమయ్యారు.
వైసీపీ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయడం కష్టం..
ఏపీలో ఇప్పటి వరకూ వెలువడిన సర్వేలు.. ఏపీలో పరిస్థితులు.. తమకు పట్టున్న స్థానాలు వంటి అంశాలపై అమిత్ షా చర్చించినట్టు సమాచారం. నిజానికి ఏపీలో బీజేపీకి ఏమాత్రం పట్టు లేదు. అయినా కూడా పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారంటే.. దీనికి కారణం లేకపోలేదు. టీడీపీ - జనసేనలు ఏకమైనా కూడా వైసీపీ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయడం కష్టం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లను నమోదు చేయించారు. ఇది చాలదన్నట్టు వలంటీర్లకు ప్రత్యేక రాజకీయ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎన్నికల్లో ఎలా తమకు సహాయ సహకారాలు అందించాలో కూడా వారికి నేర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు బీజేపీ సాయం కోరుతున్నారని తెలుస్తోంది.