తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గులాబీ పార్టీకి గడ్డు పరిస్థితులే ఎదురు అవుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం నాడు సచివాలయంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అవేంటంటే.. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నల్లగొండలో సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ సభకు తమ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీని సైతం ఆహ్వానించాలని నిర్ణయించింది. అయితే ఈ సభ నాటికి బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని కోమటిరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నేతలు దాదాపుగా కాంగ్రెస్‌లో చేరడం ఖాయమన్నారు. కోమటిరెడ్డి ఇంత ధీమాగా ఎలా చెప్పారనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిని చూస్తుంటేనేమో కోమటిరెడ్డి వ్యాఖ్యలు నిజమవుతాయనే అనిపిస్తోంది.
పూర్తి పట్టును సాధించిన రేవంత్..
తాజాగా ఢిల్లీలో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బి. వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇది నిజంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఊహించని షాకే. ఇక మున్సిపాలిటీలపై కూడా కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. ఒక్కొక్కదాన్ని తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తూ సక్సెస్ అవుతోంది కూడా. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పెద్దలు రేవంత్ ప్రభుత్వం ఎంతో కాలం మనలేదని.. కుప్పకూలిపోతుందని.. తిరిగి కేసీఆరే సీఎం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ కేవలం రెండంటే రెండు నెలల్లోనే రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా తమ శాఖలపై, ప్రభుత్వంపై పూర్తి పట్టును సాధించారు. ఆ వెంటనే కేసీఆర్ పాలనలో ప్రాజెక్టుల పేరిట జరిగిన అవినీతి, కరెంటు బకాయిలు, ఆర్థిక పరిస్థితులను జనాలకు వివరించారు.
పెరుగుతున్న పొలిటికల్ హీట్
మొత్తానికి బీఆర్ఎస్‌ను చక్కగా రేవంత్ రెడ్డి బ్లాక్ చేసేశారు. కేసీఆర్‌ను అపర చాణిక్యుడిగానూ.. ఆయనను గద్దె దించడమనేది అసాధ్యమంటూ గొప్పలు చెబుతూ వచ్చిన బీఆర్ఎస్‌కు రేవంత్ రెడ్డి గట్టి షాక్‌లే ఇస్తున్నారు. తాడిని తన్నేవాడుంటే తలదన్నేవాడుంటాడని చెప్పకనే చెబుతున్నారు. ఇక ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలైతే రానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలియనుంది. బీఆర్ఎస్‌కు ఇది సదవకాశమే. దీనికోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కార్యాచరణ మొదలు పెట్టాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. తిరిగి తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటలేదంటే ఆ పార్టీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. అలాగని రేవంత్ ఏమీ చేతులు ముడుచుకుని కూర్చోరు. ఇప్పటికే 12 సీట్లు ఖాతాలో వేసుకోవాల్సిందేనని భీష్మించారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..!