ఏపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. టీడీపీ-జనసేన, వైసీపీ ఈ రెండు పార్టీల మధ్యలో బీజేపీ దోబూచులాడుతోంది. స్నేహితుడా.. స్నేహితుడా అంటూ ఒంటరిగా పోటీ చేసి రహస్య స్నేహితుడికి సాయపడుతుందా? లేదంటే.. టీడీపీ-జనసేన కూటమిలో చేరుతుందా? అనేది తెలియడం లేదు. నిజానికి ఏపీలో బీజేపీకి పట్టే లేదు. కనీసం తెలంగాణలో ఉన్నంత పట్టు కూడా లేదు. ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలేది లేదు.. ఏ పార్టీకి నష్టంగా మారేది లేదు. చివరకు ఆ పార్టీకి డిపాజిట్లు సైతం దక్కే పరిస్థితి లేదు. అయినా సరే.. అధికార పార్టీ బీజేపీని ఒక్క మాటంటే ఒక్క మాట కూడా అనదు. రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా నోరు మెదపదు. చివరకు ప్రతిపక్ష పార్టీలదీ అదే దారి.
రహస్యమేదో ఉన్నట్టే కదా..
ఇక బీజేపీ ఏమైనా తక్కువ తిన్నదా? విపక్షంలో తాను పొత్తు పెట్టుకున్న జనసేన కూడా ఉంది. పైగా జనసేన పార్టీతో పాటు ఆ పార్టీ అధినేతపై సీఎం జగన్మోహన్ రెడ్డి సహా అధికార పార్టీ నేతలంతా బూతులతో రెచ్చిపోయినా కూడా బీజేపీ నోరు మెదపడం లేదంటే.. ఆ రెండు పార్టీల మధ్య రహస్య స్నేహమేదో ఉన్నట్టే కదా. అలాగే మిత్రపక్షమైన జనసేనతో కలిసి బీజేపీ కూడా ఏపీలో ఎలాంటి కార్యాచరణకూ తెరదీసింది లేదు. వైసీపీ అంటే భయపడటానికి ఒక కారణముంది. బీజేపీ నేతలకు ఎదురెళితే ఎక్కడ కేసుల నుంచి బయటపడలేమో.. ఎక్కడ జైలు బాట పట్టాల్సి వస్తుందోనని అధికార పార్టీ భయపడుతోందనడంలో సందేహం లేదు. అందుకే బీజేపీని పల్లెత్తు మాట కూడా అనదు.
బీజేపీ అంతలా సహకరిస్తోందా?
అయితే వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ ఎందుకు మాట్లాడదు? ప్రతిపక్ష నాయకుడిపై కేసులు మోపి జైలు పాలు చేసినా కూడా బీజేపీ అధిష్టానం ఖండించిన పాపాన కూడా పోలేదు. ఇప్పుడు బీజేపీ వ్యవహారశైలి చూస్తున్నా కూడా తన రహస్య స్నేహితుడికి సాయపడేలానే కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే జనసేన సాయం కావాలి. ఆ పార్టీతో పొత్తు కావాలి. ఏపీ విషయానికి వస్తే మాత్రం దానితో సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తోంది. అసలు వైసీపీకి తెరవెనుక ఇంత సహాయ సహకారాలు అందించేందుకు ఆ పార్టీ బీజేపీ అధిష్టానానికి ఏం చేస్తోందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. మహా అయితే లోక్‌సభలో వైసీపీ ఎంపీలు బీజేపీకి సహకరిస్తారు అంతే కదా. ఈ మాత్రానికే వైసీపీకి బీజేపీ అంతలా సహకరిస్తోందా? ఈ ఎన్నికల్లో బీజేపీ పాత్ర ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.