టీడీపీ-జనసేన మధ్య పొత్తు లేదు.. సీట్ల విషయంలో గొడవలొచ్చాయ్.. పవన్ కల్యాణ్ విడిగానే పోటీ చేస్తున్నారు.. చంద్రబాబు ఒంటరయ్యారు..! ఇవీ గత కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్‌గా చర్చకొచ్చిన విషయాలు. ఎందుకంటే.. మిత్రపక్షంగా ఉన్న రెండు పార్టీలు కలిసి అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితుల్లో ఎవరికి వారుగా ఇదిగో వీళ్లే పోటీ చేసేదని చెప్పడంతో రచ్చ రచ్చగా మారింది. టీడీపీకి పోటీగా జనసేన కూడా రాజాం, రాజానగరం నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి తయారయ్యిందని అభిమానులు ఆందోళన చెందారు. సీన్ కట్ చేస్తే.. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచ్చేశారు. దీంతో.. అబ్బే చిన్న చిన్న పొరపచ్చాలంతే.. మేమంతా ఒకటేనని ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానులకు సందేశం పంపారు. ఆదివారం నాడు.. చంద్రబాబు ఇంట్లో మూడున్నర గంటలపాటు సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో.. భవిష్యత్ కార్యాచరణపై నిశితంగా చర్చించారు.
సీట్ల లెక్కలు తేలాయ్!
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీ చేసే స్థానాలపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, 03 పార్లమెంట్ స్థానాలను ఫిక్స్ అయ్యాయయని తెలియవచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీకి అనుకూలంగా ఉన్న దినపత్రికలు, టీవీ చానెళ్లలో రోజుకో జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం అభ్యర్థుల జాబితాను రాసుకుంటూ వస్తున్నాయి. దీంతో దాదాపు లెక్కలు తేలిపోయినట్టేనని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే.. బీజేపీతో కలిసి వెళ్లాలా..? లేకుంటే టీడీపీ-జనసేన మాత్రమే పోటీ చేయాలా..? అనేదానిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థుల ప్రకటనకు బ్రేక్ పడిందని టీడీపీ, జనసేన శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్పుడు లీకయిన 30, 03 ఫార్ములా ఎంతవరకూ కరెక్ట్ అనేదానిపై ఫుల్ క్లారిటీ అనేది ఎక్కడా రాలేదు. టీడీపీ, జనసేనకు చెందిన ముఖ్య నేతల నుంచి వచ్చినదీ ఈ సమాచారం.
ఇక విమర్శలు, ప్రకటనలొద్దు!
ఉండవల్లిలోని నివాసంలో జరిగిన సమావేశంలో.. చంద్రబాబు-పవన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై బహిరంగంగా విమర్శలు, ప్రకటనలు.. అంతకుమించి అభ్యర్థుల గురించి అస్సలు ప్రకటనలే చేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ఎందుకంటే టీడీపీ రెండు ప్రకటించడం.. పోటీగా జనసేన కూడా రెండు స్థానాలను అనౌన్స్ చేయడంతో ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానులకు అసలేం జరుగుతోందే తెలియని పరిస్థితి. అసలే టీడీపీ-జనసేన గ్యాప్ వచ్చిందని రూమర్స్ రావడం.. సీట్ల పంపకాల్లో తేడా కొట్టడం ఇవన్నీ రచ్చ రచ్చగా మారక మునుపే చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారని సమాచారం. సో.. ఇకపై జనసేన-టీడీపీ నేతలు ఏం చేసినా ఉమ్మడి కార్యాచరణ త్వరలో ఉండబోతోందని తెలుస్తోంది. చూశారుగా.. ఒక్క భేటీతో సీట్ల లెక్కలు ఎలా తేలిపోయాయో.. ఇదండి జనసేన, టీడీపీ లెక్కల పంచాయితీ.. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.