విపక్షాల్లో సొంత చెల్లి కూడా చేరిపోయి బాగోతమంతా బయట పెడుతుంటే ఎలారా దేవుడా? అని బాధపడుతున్న జగన్‌కు సొంత పార్టీలోని ముగ్గురు నేతలు జోరీగల మాదిరిగా తయారయ్యారు. ఎంత పొగబెట్టినా బయటకు పోరు.. పోనీలే పార్టీలో ఉండి కామ్‌గా ఉంటారా? అంటే నిత్యం మంట పెడుతుంటారు. వారిలో ప్రథముడు నర్సారావుపేట ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఈయన ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ అధినేత జగన్‌ను ఏకి పారేస్తుంటారు. జగన్ చేతికి అయితే ఒకసారి రఘురామ చిక్కారు. ఆ సమయంలో కాళ్లు వాయగొట్టారు. ఇక తగ్గుతారులే అనుకున్నారంతా. ఆయన మాత్రం బూస్ట్ తాగిన సచిన్ మాదిరిగా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నారు.
మాటలతో వదిలేస్తారా అంటే అదీ లేదు..
ఢిల్లీలో కూర్చొని తమ పార్టీ అధినేత అవినీతిపరుడు, అదీ ఇదీ అంటూ చేసిన ప్రతి తప్పునూ వేలెత్తి చూపిస్తున్నారు. మొత్తానికి తన విమర్శలతో జగన్ ప్రతిష్టను పాతరేయడంలో రఘురామకు ఆయనే సాటి. పోనీ మాటలతో వదిలేస్తారా? అంటే అదీ లేదు. హైకోర్టు మొదలు సుప్రీంకోర్టు వరకూ కేసుల మీద కేసులు వేసి జగన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ఇక జగన్‌కు ఇబ్బందికరంగా తయారైన వారిలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. ఈయన జగన్‌కు స్వయానా బంధువు. గతంలో జగన్‌కు ఆకాశానికి ఎత్తిన నేతల్లో బాలినేని ఒకరు. అలాంటి బాలినేనికి ఉన్నట్టుండి జగన్ ప్రాధాన్యం తగ్గించేశారు. ఇక అప్పటి నుంచి టామ్ అండ్ జెర్రీ వార్ ప్రారంభం.
వసంత వ్యవహారం మరోలా..
బాలినేని కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లరు. పార్టీలో ఉండి సతాయిస్తారు. ఊ అంటే ఆ అంటే అలుగుతారు. మొన్నటికి మన్న జగనన్నతో కలిసి నడిచేందుకు ‘సిద్ధం’ అంటూ కోడ్స్ పెట్టి మరీ చెప్పిన బాలినేని.. ఆ వెంటనే హైదరాబాద్‌కు జంప్.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్. విషయం ఏంటంటే ఒంగోలు సీటును చెవిరెడ్డికి ఇవ్వడమే.. ఇక బాలినేని వ్యవహారం ఇలా ఉంటే.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యవహారం మరోలా ఉంది. గతంలో ఓసారి పార్టీలో కొనసాగాలంటే గుండాలను మెయిన్‌టైన్ చేయాలని.. కత్తులు, కటార్లతో ప్రతిపక్షాలను భయపెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా సిద్ధం సభకు దూరంగా ఉంటానని.. జన సమీకరణ కూడా చేసేదిలేదని స్పష్టం చేశారు. ఇక చేసేదేమీ లేక వైసీపీ అధినేత సభ బాధ్యతలను కేశినేని నానికి అప్పగించారు. బయటి వారితోనే జగన్ వేగాలా? లేదంటే పార్టీలోని వారితో వేగాలా? జగనన్నకు ఏంటీ తలపోటు?