నాకు బ్యాడ్ టైమ్ నడుస్తున్న సమయంలో కొందరి ప్రభావం, ఒత్తిడి కారణంగా అన్నయ్యపై నోటికొచ్చినట్లు మాట్లాడాను.. ఇప్పుడు నా తప్పు తెలుసుకుని మనస్ఫూర్తిగా ఆయనను క్షమాపణలు కోరానని అన్నారు రైటర్ చిన్నికృష్ణ. ఇంద్ర సినిమాకు కథను సమకూర్చి ఒక్కసారిగా స్టార్ రైటర్‌గా మారిన చిన్నికృష్ణ.. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తరపున మెగా ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి తనను ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నానని, అంతటి మహానుభావుడిని ఈ నోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకు.. కాళ్లమీద పడి మరి క్షమాపణలు కోరానని తెలుపుతూ.. తాజాగా చిన్ని కృష్ణ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో.. అన్నయ్య చిరంజీవిగారికి పద్మవిభూషణ్ వచ్చిందని తెలిసి చాలా సంతోషించా. ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను. ఈ భూమ్మీద పుట్టిన అందరూ అనను కానీ కొందరు తప్పులు చేస్తారు, తప్పులు మాట్లాడతారు అన్నది నగ్నసత్యం. నా మీద నమ్మకంతో నన్ను పిలిచి ఇంద్ర సినిమా ఇచ్చిన చిరంజీవిగారిని నాకు బ్యాడ్ టైమ్ నడుస్తున్న సమయంలో పేర్లు చెప్పను కానీ కొందరి ప్రభావం, ఒత్తిడి వల్ల.. నోటికొచ్చినట్లు మాట్లాడాను. ఆ తర్వాత నా భార్య, బిడ్డలు, సమాజం, చెల్లి, బావ, మిత్రులు నన్ను భయంకరంగా తిట్టారు. ఆ క్షణం నుండి ఇప్పటి వరకు ఆ భగవంతుడి ముందు, నా స్నేహితుల ముందు క్షమాపణ కోరుతూనే ఉన్నాను. నాలో నేను ఎంతో అంతర్మధనం చెందాను.
ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిందని శుభాకాంక్షలు చెప్పడానికి ఇంటికివెళితే.. ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న తీరుకానీ, నా కుటుంబ భాగోగులు అడిగిన విధానం చూసి.. నాలో నేనే బాధ పడ్డాను. ఇలాంటి వ్యక్తినా.. నా నోటితో తప్పుగా మాట్లాడాను అని నా తప్పు తెలుసుకుని క్షమించమని అన్నయ్యను అడిగాను. పెద్ద మనసుతో ఆయన క్షమించి, దగ్గరకు తీసుకుని కథలు ఏమన్నా రాస్తున్నావా చిన్ని? అని ఎంతో ఆప్యాయంగా అడిగారు. అన్నయ్య మనసారా మాట్లాడటమే కాకుండా.. కలిసి పని చేద్దాం.. ఏమైనా కథలు ఉంటే చెప్పమన్నారు. ఈసారి ఆయనతో పని చేసే సినిమా భారతదేశం గుర్తు పెట్టుకునేలా ఉంటుంది. ఎన్నో అవార్డులు భారత ప్రభుత్వం నుంచి అన్నయ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనకు తోబుట్టువుగా పుట్టాలని కోరుకుంటూ.. అన్నయ్యా నన్ను క్షమించండి.. అని చెప్పుకొచ్చారు.