నంది అవార్డుల విషయంలో తెలంగాణ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత.. ఏ ప్రభుత్వం కూడా నంది అవార్డులను ప్రోత్సహించలేదు. సినీ కళాకారులకు ప్రభుత్వం తరపున లభించే పురస్కారమైన నందిని ఏపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెడితే.. తెలంగాణ ప్రభుత్వం నందిని సింహా అంటూ మసిపూసి మారేడు కాయ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇదిగో సింహా.. అదిగో సింహా అని అనడమే కానీ.. ఒక్కరికీ అవార్డు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం.. సినిమా ఇండస్ట్రీతో ఫ్రెండ్లీగా మూవ్ అవడమే కాకుండా.. తాజాగా నంది అవార్డులపై కూడా ప్రకటన చేశారు.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలలో నంది అవార్డుల ప్రస్తావన తెచ్చారు. ఇకపై నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరుతో ఇస్తామని ప్రకటించారు. కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం అవార్డును ఇస్తుంది. ఇదే వేదికపై ప్రకటిస్తున్నా.. వచ్చే సంవత్సరం నుండి గద్దరన్న ప్రతి జయంతి రోజున ఈ పురస్కారాలను అందజేస్తాం. ఇదే నా మాట.. నా మాటే శాసనం, నా మాటే జీవో.. అని రేవంత్ రెడ్డి ఉద్వేగంగా చెబుతుంటే.. రవీంద్రభారతి హోరెత్తింది.
ప్రజాగాయకుడు గద్దర్ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రవీంద్ర భారతి వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అంతేకాదు, ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహ ఏర్పాటునకు కృషి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.