అసలే అభిమన్యుడిని కాను.. అర్జునుడినని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలన్నీ పలుకుతుంటే ఈ సర్వేలేంటి? ఇంత దారుణంగా వస్తున్నాయి? అసలు బయటి సర్వే అయితే పెయిడ్ సర్వే అని కొట్టేసేవారు. కానీ ఐప్యాక్ సర్వే కావడంతో సర్వే ఫలితం బయటకు రాకుండా చూసుకోవడం తప్ప చేసేదేమీ లేదు. గత నాలుగున్నరేళ్ళుగా ఐప్యాక్ బృందం ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ, ప్రభుత్వ పని తీరు, మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరు, ప్రజాదరణ తదితర అంశాల ఆధారంగా ఐప్యాక్ సంస్థ సర్వే చేస్తోంది. దాని రిపోర్టులను ఎప్పటికప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి సమర్పిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా సమర్పించింది.
డామిట్.. కథ పూర్తిగా అడ్డం తిరిగింది..
షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక మరోసారి ఐప్యాక్ టీం సర్వే నిర్వహించింది. కానీ డామిట్ కథ పూర్తిగా అడ్డం తిరిగింది. అసలే సర్వేల ఆధారంగా సిట్టింగ్‌లను మార్చి లేనిపోని తలనొప్పులను మూటగట్టుకుని మరీ తెచ్చుకున్న వైసీపీకి ఈ సర్వే తల తెగనరికంత పని చేస్తోంది. ఈ సర్వే తాలుకు ఫలితాలు లీక్ అయ్యాయి. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. లీక్ అయిన సర్వే ప్రకారం ఈసారి వైసీపీ గెలుచుకునే అసెంబ్లీ స్థానాలెన్నో తెలిస్తే మైండ్ బ్లాక్, రెడ్, వైట్ అవడం ఖాయం. గత ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన వైసీపీ.. ప్రస్తుతం కేవలం 32 సీట్లతో సరిపెట్టుకుంటుందట. హతవిధీ.. ఏంటీ దారుణం?
పొత్తు విడగొట్టాలనుకునేది అందుకా?
ఇక టీడీపీ, జనసేన కూటమికి ఏకంగా 143 సీట్లు వస్తాయని ఐ ప్యాక్ సర్వే చెబుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది మాత్రం తెలియరాలేదు. వైసీపీ ఇంత దారుణంగా ఫెయిల్ అవడానికి కారణం.. జగన్ స్వయంకృతాపరాధంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరట. టీడీపీ, జనసేన పొత్తు కూడా వైసీపీకి విఘాతంగా మారనుందట. అందుకేనేమో జగన్ అండ్ టీం పొత్తు విడగొట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రజానీకమంతా టీడీపీ, జనసేన కూటమివైపే ఉందట. అలాగే టీడీపీ అధినేత అరెస్ట్ తర్వాత సానుభూతి పెరగడం, షర్మిల ఎంట్రీతో జగన్ ప్రతిష్ట మసకబారడం వంటి అంశాలు చకచకా జరుగుతున్నాయి. అందుకేనేమో ఇప్పటికిప్పుడు పదవిలో నుంచి దిగిపోవాలన్నా తాను సిద్ధమంటూ జగన్ భారీ డైలాగ్స్ వదిలేది.