వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా తన టీం అంతా నిన్న మొన్నటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను టార్గెట్ చేస్తూ ఉండేవారు. వీరికి కనీసం వారి కుటుంబంలోని ఆడవారిని విమర్శించకూడదన్న జ్ఞానం కూడా ఉండేది కాదు. రాజకీయాలతో సంబంధంలేని వారి కుటుంబ సభ్యులను సైతం ఇష్టానుసారంగా మాటలు అనేవారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ నేతలంతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్, సీఎం జగన్ సోదరి అయిన వైఎస్ షర్మిలను టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఒకరకంగా చెప్పాలంటే చెల్లిని జగన్ నేరుగా టార్గెట్ చేయలేక తమ పార్టీ నేతలతో దాడి చేయిస్తున్నారు.
అవినీతి, అక్రమాలను బయటపెడుతున్న షర్మిల..
తమ సేన షర్మిలను అన్ని మాటలంటున్నా జగన్ కూల్‌గా ఉంటున్నారంటే దానికి కారణం ఆయనకు అన్నీ తెలిసి జరగడమేననడంలో సందేహం లేదు. మొత్తానికి షర్మిల అయితే అన్నపై ప్రస్తుతానికి ఒంటరి పోరే సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ తాను ఒంటరి పోరు సాగిస్తున్నానని.. తనకు జనమే అండగా నిలవాలంటూ జగన్ వేడుకుంటున్నారు. మరి ఇప్పుడు చెల్లి కూడా తనపై ఒంటరి పోరే చేస్తున్నారు కదా. జగన్‌ను నోరారా అన్న అంటూనే ఆయన చేసిన అవినీతి, అక్రమాలన్నీ ఆమె బయటపెడుతూ వస్తున్నారు. సొంత చెల్లెలిపైనే బురద జల్లిస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల ఎదురుదాడి చేస్తున్నా.. జగన్ మాట్లాడలేని దుస్థితి.
పదేళ్ల పాటు రాజకీయాలకు దూరం..
వైసీపీ నేతలు చేస్తున్న దాడితో షర్మిలకైతే సానుభూతి మరింత పెరుగుతోందనడంలో సందేహం లేదు. మరోపక్క ఆమెకు వివేకా కూతురు సునీతా రెడ్డి సైతం అండగా నిలుస్తారని టాక్. ఆమె ఇప్పటి వరకూ నేరుగా ప్రచార బరిలోకి అయితే దిగలేదు కానీ తాజాగా వారిద్దరి మధ్య ఇడుపులపాయలో మూడు గంటల పాటు మీటింగ్ జరిగింది. దీంతో మరికొద్ది రోజుల్లో షర్మిలకు అండగా సునీత వస్తారని తెలుస్తోంది. ఇక తెలంగాణ నుంచి మంత్రి కొండా సురేఖ సైతం షర్మిలకు మద్దతుగా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారట. గతంలో అంటే రాష్ట్ర విభజనకు ముందు వైసీపీ తరుఫున ప్రచారం చేసి పదేళ్ల పాటు కొండా దంపతులు రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు జగన్‌కు ప్రత్యర్థిగా ఆమె రంగంలోకి దిగనున్నారు. మొత్తానికి అక్కచెల్లెమ్మలని ఏ ముహూర్తాన జగన్ స్లోగన్ అందుకున్నారో కానీ ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో అదే అక్కచెల్లెమ్మలతో జగన్ పోరాడాల్సి వస్తోంది.