భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన శ్రీ ఆంజనేయస్వామి స్ఫూర్తిగా తెరకెక్కించిన హను-మాన్ చిత్రంలోని ప్రతిఘట్టం ఆకట్టుకుందని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సోమవారం ఆయన హను-మాన్ చిత్రాన్ని స్నేహితులతో కలిసి వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ట్విట్టర్ ఎక్స్ వేదికగా.. తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చాలా గొప్పగా చెప్పారు సార్ అంటూ.. వెంకయ్య నాయుడు ట్వీట్‌కు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా వెంకయ్య నాయుడు ట్వీట్‌కు రియాక్ట్ అయ్యారు.
మీ మాటలు విన్న తర్వాత చాలా గొప్పగా గౌరవించబడ్డాననే ఫీలింగ్ కలుగుతుంది సార్. మీ వంటి వారు చెప్పే ఇటువంటి మాటలు.. హనుమాన్ వంటి చిత్రాలను రూపొందించడానికి స్ఫూర్తిగా నిలుస్తాయి. ప్రతిష్టాత్మక పురస్కారం పద్మ విభూషణ్ మిమ్మల్ని వరించినందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. సమాజానికి మీరు చేసిన విశేషమైన కృషికి దక్కిన గౌరవమిది.. అని వెంకయ్య నాయుడు ట్వీట్‌కు ప్రశాంత్ వర్మ రిప్లయ్ ఇచ్చారు. ఇక హనుమాన్ సినిమాపై మాజీ ఉపరాష్ట్రపతి ఎలా స్పందించారంటే..
హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్‌లో సోమవారం హనుమాన్ చలనచిత్రాన్ని స్నేహితులతో కలిసి వీక్షించాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన శ్రీ ఆంజనేయస్వామి స్ఫూర్తిగా తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతిఘట్టం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయి. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, ఇతర నటుల నటన ఆకట్టుకుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి, దర్శకుడు ప్రశాంత్ వర్మకు, చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు.. అని వెంకయ్య నాయుడు ట్వీట్‌లో పేర్కొన్నారు.