సూపర్ స్టార్ మహేష్ బాబుతో కొరటాల శివ చేసిన శ్రీమంతుడు సినిమా కథ విషయంలో అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రచయిత శరత్ చంద్ర.. ఈ కథ నాదని, కొరటాల కాపీ చేశాడని కోర్టులో కేసు ఫైల్ చేయగా.. ఆ కోర్టు, ఈ కోర్టు అంటూ.. చివరికి ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. నాంపల్లి కోర్టు, తెలంగాణ హైకోర్టు కాదని సుప్రీంకోర్టుకు వెళ్లిన కొరటాలకు అక్కడ కూడా చుక్కెదురైంది. నాంపల్లి, తెలంగాణ హైకోర్టులలో వచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఫేస్ చేయాల్సిందేనని సోమవారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
అంతకు ముందు స్వాతి పత్రికలో వచ్చిన తన కథను కాపీ చేసి, శ్రీమంతుడు పేరుతో సినిమా తీసినట్లుగా కొరటాలపై రచయిత శరత్ చంద్ర హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. శరత్ చంద్ర పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు దర్శకుడు శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వెంటనే శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఇదే తీర్పు వ్యక్తమైంది. దీంతో కొరటాల సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో వైకాపా ఎంపి, న్యాయవాది అయిన నిరంజన్ రెడ్డి.. కొరటాల తరపున వాదన వినిపిస్తూ.. సినిమా విడుదలై, థియేటర్ల నుండి వెళ్లిపోయిన తర్వాత శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించాడని, ఇరు కోర్టులు తమ వాదనను పట్టించుకోలేదని తెలపగా.. విచారణ జరిపిన జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్.. ఇందులో చెప్పడానికేం లేదని స్పష్టం చేశారు. దీంతో తమ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లుగా నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. దీంతో కొరటాల క్రిమినల్ కేసును ఫేస్ చేయాలని మరోసారి ధర్మాసనం స్పష్టం చేసినట్లయింది. మరి ఈ కేసుపై కొరటాల ఎలా ముందుకు వెళతారనేది చూడాల్సి ఉంది.