ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏమో అనుకున్నాం కానీ.. ఏపీ సీఎం జగన్‌కు గొంతులో ముద్ద దిగకుండా చేస్తున్నారు. షర్మిల ఒక్కో ప్రెస్‌మీట్‌తో జగన్ గొంతుకలో వెలక్కాయ పడినట్టుగా అవుతోంది. అన్నకు సింహాసనం వేసి మరీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన షర్మిలే ఆ కుర్చీని లాగేసేందుకు ప్రయత్నిస్తుండటం ఆయనకు మింగుడు పడటం లేదు. సొంత మీడియాలో తమ అనుయాయుల్ని పెట్టి తిట్టిస్తున్నా కూడా తమ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండటం లేదు. పోనీ జగన్ వెళ్లి చెల్లెలి విమర్శలు, ఆరోపణలకు సమాధానం ఇవ్వడం మొదలు పెడితే.. ఇక అంతే సంగతులు. అడ్డంగా బుక్ అవ్వడమే తప్ప ఉపయోగం ఉండదు.
కుమారుడి మాటలను విజయమ్మ అంగీకరిస్తారా?
నిజానికి అలా చేసి చెల్లెలికి మరింత హైప్ ఇవ్వడం తప్ప మరొకటి ఉండదు. ఏం చేసినా వైసీపీకి నష్టమే తప్ప ఉపయోగమైతే ఉండదు. ఇలాంటి సమయంలో జగన్ మాత్రం ఏం చేయాలని బాగా యోచించి.. తల్లి విజయమ్మే చెల్లికి చెక్ పెట్టగలదని భావిస్తున్నారట. కుటుంబ పరువును సాకుగా చూపించి తల్లి చేత చెల్లికి హితబోధ చేయించనున్నారట. మరి కుమారుడి మాటలను విజయమ్మ అంగీకరిస్తారా? షర్మిల మాదిరిగానే విజయమ్మ కూడా బాధపడ్డారు కదా. కనీసం తల్లి కూడా షర్మిలతో వెళ్లిపోయాక జగన్ వెళ్లి ఆమెతో మాట్లాడింది లేదు. మరి అలాంటప్పుడు అవసరానికి తన దగ్గరికి వచ్చే తనయుడిని విజయమ్మ దగ్గరకు తీస్తారా? ఆయన అవసరానికి వెళ్లి షర్మిల వాగ్దాటికి అడ్డుకట్ట వేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
కూతుర్ని వదులుకుంటారా?
సరే.. విజయమ్మ అంగీకరిస్తారా? లేదా? అనేది ఆమె మీడియా ముందుకు వస్తే తెలుస్తుంది. రాలేదంటే.. అంగీకరించినట్టే. ఒకవేళ మీడియా ముందుకు వస్తే ఆమెకు ఇన్నాళ్లూ అండగా ఉన్న కూతురు దూరమవుతుంది. కొడుకు ఇంటి నుంచి గెంటేస్తే.. ఇంతకాలం కూతురే విజయమ్మకు అండగా నిలిచారు. అలాంటి కొడుకు కోసం ఆమె కూతుర్ని వదులుకుంటారా? తల్లి మనసుకు ఇది పెను సంఘర్షణే. ఒకవేళ విజయమ్మ మీడియా ముందుకు వచ్చినా కూడా కొడుక్కి రివర్స్ అయితే అది లాభం చేయకపోగా.. మరింత నష్టం చేస్తుంది. ఇంతకాలం తమ కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీలు చీల్చుతున్నాయంటూ విమర్శలు గుప్పించిన జగన్‌కు.. ఇప్పుడు చెల్లికి అడ్డుకట్ట వేసేందుకు తల్లిని మీడియా ముందుకు తీసుకొస్తే స్వయంగా జగనే కుటుంబాన్ని చీల్చారనే బలం చేకూరుతుంది. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.