తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విమర్శలకూ తావివ్వకుండా చక్కగా పాలన కొనసాగిస్తూ వెళుతోంది. ఇక రేవంత్ రెడ్డి సీఎంగానూ.. దళిత సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగానూ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో డిప్యూటీ సీఎం నియామకానికి సంబంధించిన వార్తలు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి. ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే సెకండ్ డిప్యూటీ సీఎం నియామకం కూడా ఉండనుంది. రెండో డిప్యూటీ సీఎంకు హోంశాఖతో పాటు ఇతర ముఖ్య శాఖలు కేటాయిస్తారని కూడా టాక్ నడుస్తోంది. మరి ఆ అదృష్టవంతుడు ఎవరు?
మంత్రివర్గంలో 18 మందికి అవకాశం..
సీఎం పదవి కోసం తెలంగాణలో చాలా మంది సీనియర్లు పోటీ పడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మాత్రం రేవంత్‌కేనని స్టిక్ అయిపోయారు. వ్యతిరేకించే వాళ్లు.. ఉంటే ఉండొచ్చు.. పోతే పోవచ్చంటూ ఆదేశాలు సైతం జారీ చేయడంతో అంతా సైలెంట్ అయిపోయారు. మరి అలాంటిది ఇప్పుడు సెకండ్ డిప్యూటీ సీఎం అంటే పోటీ ఉండదా? కేబినెట్‌ల సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎంకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోందట. ఫిబ్రవరిలో కేబినెట్ విస్తరణ పక్కాగా ఉండే అవకాశం అయితే ఉందట. మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉండగా.. ప్రస్తుతం 12 మంది మంత్రులున్నారు. ఇంకా ఆరు పదవులు ఖాళీగా ఉన్నాయి.
కోదండరామ్‌కి విద్యాశాఖ ఫిక్స్..
సామాజిక వర్గాలతో ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఆరు ఖాళీలను భర్తీ చేస్తారట. ఇక రెండో డిప్యూటీ సీఎంకు హోంశాఖతో పాటు ఇంకేదైనా కీలక శాఖను అప్పగిస్తే నాలుగు మాత్రమే ఖాళీగా ఉంటాయి. ఈ క్రమంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ఎంపికయ్యారు. కోదండరామ్‌కి విద్యాశాఖ ఫిక్స్ అని సమాచారం. అమీర్ అలీఖాన్‌కి రెండో డిప్యూటీ సీఎం పదవిని అప్పగించాలని భావిస్తున్నారట. అయితే ఇప్పటికే ముస్లిం సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కిందని.. కాబట్టి బీసీలకు సెకండ్ డిప్యూటీ సీఎం అవకాశం కల్పించాలని బీసీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారట. ఈ విషయాన్ని అధిష్టానానికి అప్పగించారట. దీంతో రేవంత్ ఈ వ్యవహారాన్ని అధిష్టానానికే వదిలేశారట. ఇక రాహుల్ ఎవరికి పగ్గాలు అప్పగిస్తారో చూడాలి.