ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం హీటెక్కుతోంది. వైసీపీ ఎలా విజయం సాధించాలా? అని నానా తంటాలు పడుతుంటే.. టీడీపీ - జనసేన పొత్తుల వ్యవహారం గందరగోళం సృష్టిస్తోంది. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో హస్తినకు పవన్ వెళుతున్నారని కూడా టాక్. టీడీపీ, జనసేనలు పొత్తులతో సీట్లు సర్దుబాట్లు చేసుకుని అభ్యర్ధులను ప్రకటించేందుకు సిద్దమవుతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే కష్టమని భావించిన ఏపీ బీజేపీ నేతలు.. పొత్తుల గురించి ఏదో ఒకటి తేలుస్తారా? లేదా? అని తమ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారట. ఈ క్రమంలోనే పవన్‌కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది.
బీజేపీ కలిసొస్తే బాగుంటుందని..
ఈసారి ఎన్నికలైతే వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన అనేలా హోరాహోరీ ఉండే అవకాశం ఉంది. దీనిలో ఎలాంటి సందేహమూ లేదు. పైగా వైసీపీకి ముందున్నంత సీన్ అయితే ఇప్పుడు లేదు. అసలు ఏపీలో పరిస్థితేంటో స్థానిక బీజేపీ నేతలకు బాగా తెలుసు. కాబట్టి ఈ తరుణంలో టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుంటే మంచిదని తమ అధిష్టానానికి బీజేపీ నేతలు సూచించారట. ఏపీ బీజేపీకి అయితే ఒంటరిగా వెళితే డిపాజిట్లు కూడా దక్కవు. ఏదో ఒక పార్టీతో పొత్తుతో వెళ్లాల్సిందే. కాబట్టి ఏ పార్టీతో కలిసి వెళితే ఉత్తమమో ఆ పార్టీతోనే కదా బీజేపీ నేతలు వెళతారు. అందుకే టీడీపీ - జనసేన కూటమితో కలిసి వెళదామని తమ అధిష్టానానికి సూచించారట. టీడీపీ - జనసేనలు అయితే బీజేపీ కలిసొస్తే బాగుంటుందని గతంలో ఆలోచించాయేమో కానీ ఇప్పుడైతే చేయడం లేదని తెలుస్తోంది.
టీడీపీ ఇంకెందరిని బుజ్జగించాలో..
ఇప్పటికే సీట్ల పంపకం రెండు పార్టీల మధ్య తలనొప్పికి కారణమవుతోంది. ఇంకో పార్టీ కూడా వచ్చి చేరితే మరింత కష్టమవుతోంది. కాబట్టి మెడకు ఇంకో డోలు తగిలించుకోవాలని టీడీపీ అయితే భావించడం లేదని సమాచారం. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన బీజేపీ పెద్దలతో పొత్తుల గురించే అని వేరే చెప్పక్కరలేదు. ఈ తరుణంలో బీజేపీ కూడా వచ్చి పొత్తులో చేరితే.. ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో.. టీడీపీ ఇంకెందరిని బుజ్జగించాలో.. ఈ వ్యవహారం మొత్తం టీడీపీ నేతలను అయితే కలవరానికి గురి చేస్తోంది. పైగా బీజేపీ వచ్చి పొత్తులో చేరితే టీడీపీ - జనసేన కూటమికి లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఇదే విషయాన్ని సర్వేలు కూడా చెప్పాయి. మరి పవన్ హస్తినకు వెళ్లి ఏం చేస్తారో చూడాలి.