ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియదు కానీ.. ఇప్పటికే టాప్ హీరోయిన్లందరి పేర్లు ఒక రౌండ్ తిరిగి వచ్చాయి. ముందు నయనతార అన్నారు.. ఆ తర్వాత అనుష్క అన్నారు. ఇప్పుడేమో శృతిహాసన్ అని అంటున్నారు. ఇంతకీ ఏం సినిమా అది అని అనుకుంటున్నారా? స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న తొలి తమిళ నారీమణి రాణి వేలు నాచియార్ బయోపిక్‌ని తీసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్‌లో మొదట రాణి పాత్రలో నయనతారని అనుకున్నారు. ఆ తర్వాత చిత్ర దర్శకుడు అనుష్కని ఊహించుకుంటున్నట్లుగా చెప్పాడు. ఇప్పుడు తమిళనాట శృతిహాసన్ చేతుల్లోకి ఈ రాణీ పాత్ర వెళ్లినట్లుగా వార్తలు వినబడుతున్నాయి.
దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ రాజేంద్రన్ మణిమారన్ డ్రీమ్ ప్రాజెక్ట్ రాణి వేలు నాచియార్ బయోపిక్. ఈ బయోపిక్ కోసం ఆయన ఎంతో రీసెర్చ్ కూడా చేసినట్లుగా ఆ మధ్య తెలిపాడు. పి.సి. శ్రీరామ్ కెమెరామెన్‌గా ఈ బయోపిక్‌ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఆయన అధికారికంగా ప్రకటించాడు కూడా. అలాగే అనుష్క పేరు కూడా అనుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించాడు. అయితే ఈ బయోపిక్ మాటల వరకే కానీ.. ఇంత వరకు తెరరూపం దాల్చలేదు. ద క్వీన్ ఆఫ్ శివగంగ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కాల్సిన ఈ బయోపిక్ కొన్ని వివాదాల కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇప్పుడైనా సెట్స్‌పైకి వెళుతుందో, లేదో తెలియదు కానీ.. శృతిహాసన్ టైటిల్ రోల్ పోషించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరి ఈ వార్తలైనా నిజం అవుతాయా? అనేది తెలియాల్సి ఉంది. శృతిహాసన్ విషయానికి వస్తే.. చాలా గ్యాప్ తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో ఆమె పట్టిందల్లా బంగారమవుతోంది. వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి, హాయ్ నాన్న, సలార్.. ఇలా వరుస సక్సెస్‌లతో శృతిహాసన్ పేరు మారుమోగుతోంది. అయితే ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన శృతిహాసన్.. ఈ వీరనారి పాత్రలో ఎలా మెప్పిస్తుందనేది చూడాల్సి ఉంది.