అయోధ్య రామయ్య పేరుతో బీజేపీ బీభత్సంగా బలపడిందా?
అయోధ్య రామాలయం.. చిరకాల హిందువుల కల. 500 వందల ఏళ్లుగా రామయ్య నడయాడిన నేల అయిన అయోధ్యలో ఆయనకు గుడి నిర్మించాలని హిందువులంతా కలలు కంటున్నారు. ఆ కలను బీజేపీ నిజం చేసేసింది. 2024 జనవరి 22న రాముల వారి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. బాల రాముడి విగ్రహానికి అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ తరుణంలో రామ జపం ఒకవైపు.. ప్రధాని మోదీ జపం మరోవైపు బీభత్సంగా జరిగిపోయాయి. నిజానికి జనాల నాడిని పట్టుకోవడంలో మోదీ దిట్ట. ఏం చేస్తే జనాలకు నచ్చుతుందో అది మాత్రమే చేస్తారు.
మొత్తం క్రెడిట్ మోదీ ఖాతాలోకే..
అందరి మాదిరిగా సంక్షేమం వంటి డబ్బు ఖర్చు పనుల జోలికి వెళ్లరు. రాముల వారి ఆలయ నిర్మాణం అనగానే కోట్లలో డబ్బు విరాళాల రూపంలో వచ్చి చేరింది. ఆలయ నిర్మాణం పూర్తైంది. కానీ క్రెడిట్ మొత్తం మోదీ ఖాతాలో జమ అయ్యింది. ప్రచారానికి పైసా ఖర్చు లేకుండా ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీకి కావల్సినంత ప్రచారం జరిగిపోయింది. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని హైజాక్ చేసి తన సొంత కార్యక్రమం మాదిరిగా జరిపించేసింది. ప్రతిపక్షాలు గైర్హాజరవడం బీజేపీకి మరింత కలిసొచ్చిన అంశం. అసలే హిందూత్వవాదులు మోదీ భజన బీభత్సంగా చేస్తుంటారు. ఇక ఈ ఆలయ నిర్మాణంతో ఆ భజనను పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లారు.
విపక్షాలకు గట్టి దెబ్బే..
దేశం మొత్తం రామజపంతో పాటు మోదీ జపం చేసేలా చేశారు. అయోధ్య రామయ్యతో పాటు బీజేపీ కూడా జనం మనసుల్లో తిష్ట వేసేలా చేశారు. నిజానికి అయోధ్య వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడం నుంచే మోదీ సక్సెస్ ప్రారంభమైంది. ఇప్పుడు ఆలయ నిర్మాణంతో పూర్తి స్థాయి సక్సెస్‌ను బీజేపీ సాధించినట్టు అయ్యింది. ఏ సభలూ.. సమావేశాలు ఏవీ లేకుండానే కావల్సినంత క్రెడిట్ వచ్చేసింది. విపక్షాలకు ఇది మామూలు దెబ్బ కాదు. పక్కాగా బీజేపీ హ్యాట్రిక్ ఖాయమైపోయినట్టే. సర్వేలన్నీ ఇదే విషయాన్ని వెల్లడించాయి. అయితే ఇక ఇప్పుడు దక్షిణాది మాటేమో కానీ ఉత్తరాదిలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇక ఇప్పుడు దేశంలోని పార్టీలన్నీ ఏకమైనా కూడా బీజేపీని అడ్డుకోవడం అసాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.