మాటల్ని ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది అంటారు. కానీ రాజకీయ నేతల విషయంలో అది సాధ్యం కాదు. కానీ వారికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవి దాటి మాట్లాడితే అసలుకే ఎసరొస్తుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం బహిరంగ సభల్లో టంగ్ స్లిప్ అవుతున్నారు. ఇది ఇబ్బందికర పరిస్థితులను తెచ్చి పెడుతోంది. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎక్కువగా జనాల్లోనే ఉండేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలలే సమయం ఉండటంతో నోటిఫికేషన్ విడుదలకు ముందే పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళుతున్నాయి.
అక్కడ టికెట్ లొల్లి స్టార్ట్..
టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రా.. కదలిరా సభలతో ఫుల్ జోష్‌తో ముందుకు వెళుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ తాను నిర్వహిస్తున్న సభల్లో అభ్యర్థుల ప్రకటనే టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. తాజాగా చంద్రబాబు అరకు, మండపేటలో అభ్యర్థులను అనౌన్స్ చేశారు. ఇలా ప్రకటించడంతో టీడీపీ, జనసేన రెండు పార్టీల్లోనూ ఆందోళన ప్రారంభమైంది. దీనిపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ టికెట్ లొల్లి ప్రారంభమైంది. తాము రెబల్‌గా బరిలోకి దిగుతామంటూ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అరకులో దొన్ను దొరను అభ్యర్థిగా ప్రకటించడాన్ని సోమా కుమారుడు అబ్రహం వ్యతిరేకిస్తున్నారు.
మండిపడుతున్న జనసేన నేతలు..
మండపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావునే ఈసారి కూడా అభ్యర్థిగా మండపేట సభలో చంద్రబాబు ప్రకటించారు. మండపేటలో చంద్రబాబు ప్రకటన తర్వాత జనసేన నేత లీలాకృష్ణ తన అనుచరులతో సమావేశమయ్యారు. కనీసం సీట్ల సర్దుబాటు కూడా కాకుండానే ఎలా అభ్యర్థులను ప్రకటిస్తారంటూ జనసేన నేతలు మండిపడుతున్నారు. ఇకపై సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది. ఇలాంటి వివాదాలేమీ రాకుండా చూసుకోవాల్సి చంద్రబాబే వివాదాలకు కారణమవడంపై చర్చనీయాంశమవుతోంది. ఇక నుంచైనా అభ్యర్థుల ప్రకటనపై చంద్రబాబు ఆచి తూచి వ్యవహరించాలని పార్టీ నేతలు అంటున్నారు.