దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు రాజకీయ వారసత్వాన్ని ఆయన సతీమణి శ్యామలాదేవి కంటిన్యూ చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కృష్ణంరాజు చనిపోయే వరకు బీజేపీ పార్టీలోనే ఉన్నారు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కొంతకాలం ఉన్నప్పటికీ.. మళ్లీ ఆయన బీజేపీ గూటికే చేరారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మరణానంతరం ఆ ఫ్యామిలీ నుండి ప్రభాస్ పాలిటిక్స్‌లోకి వస్తాడని, బీజేపీకి ప్రచారం చేస్తారని ఆమధ్య వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ ప్రభాస్, రాజకీయాలకు దూరం అనేలా వరసబెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇప్పుడా ఫ్యామిలీ నుండి కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ అయిన శ్యామలాదేవి.. రాజకీయ బాట పట్టనున్నట్లుగా.. గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
రాబోయే ఏపీ ఎన్నికలలో ఆమె వైసీపీ తరపున నర్సాపురం లోక్‌సభ స్థానానికి పోటీ చేయబోతున్నారనేలా పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కృష్ణంరాజు కూడా ఈ నియోజకవర్గం నుండే గెలుపొందారు. తాజాగా కృష్ణంరాజు జయంతిని పురస్కరించుకుని, మొగల్తూరులో భారీగా ఫ్రీ మెడికల్ క్యాంప్‌ని శ్యామలాదేవి నిర్వహించారు. ఇవన్నీ చూస్తుంటే ఆమె రాజకీయ అరంగేట్రం పక్కా అనేలా టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలో మొగల్తూరులో నిర్వహించిన ఫ్రీ మెడికల్ క్యాంప్ అనంతరం ఆమె కాసేపు మీడియాతో ముచ్చటించారు.
రాజకీయాల్లోకి వస్తానని ఆమె చెప్పలేదు కానీ.. అదే సమయంలో రానని కూడా ఆమె చెప్పలేదు. కృష్ణంరాజు ఆశయ సాధన కోసం కృషి చేస్తానని అన్నారు. పేదలకు విద్య, వైద్యం అందాలని ఎప్పుడూ కృష్ణంరాజుగారు చెబుతూ ఉండేవారని, అందుకే ఆయన జయంతికి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ క్యాంప్ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇస్తానని శ్యామలాదేవి వెల్లడించారు. సో.. ఆమె పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.