సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది. సేవాగుణంలో తన తండ్రి మహేష్ బాబునే మించి పోయేలా ఉంది సితార ఘట్టమనేని. ఇప్పటికే ఆమె అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వార్తలలో నిలిచిన విషయం తెలియంది కాదు. ఇటీవల ఆమె నటించిన ఓ యాడ్ రెమ్యూనరేషన్ కూడా సేవా కార్యక్రమాలకే ఇచ్చినట్లుగా చెప్పింది. ఇప్పుడు మరోసారి తన గొప్పమనసుని సితార చాటుకుంది.
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రాన్ని అనాథ చిన్నారుల కోసం సితార ప్రత్యేక షోని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్‌లో మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ షోకు ఆమె కూడా హాజరై.. అనాథ పిల్లలతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం వారందరితో కాసేపు సరదాగా గడిపిన సితార.. వారు అడిగిన వెంటనే ఫొటోలు కూడా దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన వారంతా సితారను తండ్రికి తగ్గ తనయ అని కామెంట్స్ చేస్తున్నారు.
గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ చిత్రంగా దూసుకెళుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ని సాధించినట్లుగా నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు.