ఆ రోజు నందమూరి తారక రామారావుగారు ఇచ్చిన సలహానే ఈ రోజు నా కుటుంబం నిలబడేలా చేసిందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, అదే సమయంలో ఏఎన్నార్ శత జయంతి కార్యక్రమాన్ని శనివారం విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం చేయగా.. మెగాస్టార్ తన బయోపిక్ బాధ్యతలని యండమూరికి ఇస్తున్నట్లుగా ప్రకటించారు.
అనంతరం ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగాపడ్డాయని, ఈ రోజు తనను నిలబడేలా చేశాయని చిరంజీవి అన్నారు. అప్పట్లో సంపాదించే డబ్బును ఇనుప ముక్కల కోసం ఖర్చు చేయకుండా.. ఏదైనా మంచి ఇల్లు కొనుక్కుని, తర్వాత స్థలాలపై పెట్టుబడి పెట్టాలని ఎన్టీఆర్ తనకు చెప్పారని అన్నారు.
ఈ ఇండస్ట్రీలో మనం ఎప్పుడూ సూపర్ స్టార్స్‌గా ఉంటామని భావించవద్దని, ఇది శాశ్వతం కాదని ఆనాడే ఆయన జాగ్రత్తలు చెప్పారు. ఆ జాగ్రత్తలు పాటించి అక్కడక్కడా స్థలాలు కొన్నానని, ఆ స్థలాలే ఈ రోజు తనని, తన ఫ్యామిలీని కాపాడుతున్నాయని చెబుతూ.. ఎన్టీఆర్ ముందస్తు సూచన తనకు ఎలా మేలు చేసిందో మెగాస్టార్ వివరించారు. ఏయన్నార్ గురించి చెబుతూ.. తన బలహీనతలను బలంగా చేసుకుని నటించేవారని.. అవే ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చాయని పేర్కొన్నారు.