తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే ఏపీ సీఎం జగన్ పయనిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి జగన్ ప్రతి పనిలోనూ కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు. అయితే అభివృద్ధి విషయంలో మాత్రం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోలేకపోయారు. కానీ కేసీఆర్‌లోని చెడును మాత్రం గ్రహించారు. కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూశారు. ప్రస్తుతం జగన్ కూడా అదే చేస్తున్నారు. కేసీఆర్ మాదిరిగానే మోనార్కిజం ప్రదర్శించారు. పార్టీ ప్రజాప్రతినిధులతో భజనలు చేయించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా పని చేస్తోందని తాము కాక ఎవరు వచ్చినా కూడా సంక్షేమ ఫలాలు జనాలకు అందవని ప్రచారం చేసుకున్నారు.
ఏసయ్య రూపంలో బొమ్మ..
సేమ్ జగన్ ప్రభుత్వం కూడా ఇదే ప్రచారం చేస్తోంది. తాము తప్ప జనాలకు సంక్షేమ పథకాలను ఎవరూ అందించలేరని చెప్పుకుంటూ వస్తోంది. కేసీఆర్ మాదిరిగానే జగన్ కూడా జనాల్లోకి వెళ్లరు.. కేసీఆర్ మాదిరిగానే జగన్ మీడియా ముందుకు పెద్దగా రారు. అంతేకాదు.. కేసీఆర్ యాదాద్రి ఆలయంలో తన బొమ్మ చెక్కించుకుంటే.. జగన్ తన పుట్టినరోజు సందర్భంగా ఏసయ్య రూపంలో తన బొమ్మను గీయించుకున్నారు. అంతేకాదు.. ప్రతిపక్ష నేతలను దుష్టులుగా అభివర్ణిస్తూ తానేదో దైవస్వరూపం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇక కేసీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రతిష్టింపచేస్తే.. జగన్ విజయవాడలో ప్రతిష్టింపజేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.
తెలంగాణ ప్రజానీకం కేసీఆర్‌ను ఆ స్థాయిలో చూడలేదు..
హైదరాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ గవర్నర్‌ని ఆహ్వానించలేదు. సేమ్ టు సేమ్ జగన్ కూడా ఏపీ గవర్నర్‌ను అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానించలేదు. ఇక ఈ కార్యక్రమంలో జగన్ గొప్పలు ఓ రేంజ్‌లో చెప్పుకున్నారు. అయితే తెలంగాణలోనూ కేసీఆర్ తానొక అంబేడ్కర్ మాదిరిగా ఊహించుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజానీకం కేసీఆర్‌ను ఆ స్థాయిలో చూడలేదు. అహంకారానికి ఐకాన్‌లా చూశారు. అదే ఆయనకు, బీఆర్ఎస్‌కు దెబ్బకొట్టింది. ఇప్పుడు జగన్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. ఇక జగన్ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం తెలియాలంటే పెద్దగా వెయిట్ చేయాల్సిన పని లేదు. కేవలం మూడు నెలలు అంతే..