అయోధ్య రామమందిర నిర్మాణం దేశంలోనే హాట్ టాపిక్. బాల రామయ్య విగ్రహం ఎత్తు కేవలం 4 అడుగులు మాత్రమే. కానీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎత్తు 206 అడుగులు. ఏపీలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. మరి ఇంత పెద్ద విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన వార్త కనీసం తెలుగు రాష్ట్రాల్లో సైతం చర్చనీయాంశంగా మారలేదెందుకు? నిజానికి జగన్ ప్రభుత్వం చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఈ విగ్రహ నిర్మాణం ఒక్కటే. తెలంగాణలో నిర్మించారనో ఏమో కానీ అంబేడ్కర్ విగ్రహాన్ని అయితే రూ.404 కోట్లతో నిర్మించేశారు.
ఎమ్మెల్సీపై జగన్ చర్యలు తీసుకున్నారా?
తనకు ఓటు బ్యాంకును తీసుకొచ్చే ఏకైక ఆయుధంగా దీనిని మలుచుకోవాలనుకున్నారు. మరి మారుతుందా? దీనికంటే ముందు జగన్ దళితుల కోసం ఏం చేశారో ఒకసారి చూద్దాం. కోడికత్తి కేసులో దళితుడైన శ్రీనుని ఐదేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉంచుతున్నారు. జగన్ కోర్టుకి హాజరవ్వాలంటూ శ్రీను తల్లి, సోదరుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే.. వారిని అరెస్ట్ చేసే యత్నం జరుగుతోంది. ఇక కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని అతికిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీపై జగన్ చర్యలు తీసుకున్నారా? తీసుకుని ఉంటే కాస్తో కూస్తో దళితులకు న్యాయం చేసినట్టు అయ్యేది కదా? అదీ జగన్ చేయలేదు.
ఉద్యోగ కల్పన ఎలా?
అలాగే రాష్ట్రంలో దళితులపై దాడులు లెక్కపెట్టలేనన్ని జరిగాయి. ఇక హత్యలు, అత్యాచారాలు, సజీవ దహనాలు పెద్ద సంఖ్యలోనే జరిగాయి. దళితులపై మూత్రం పోసి అవమానించడం వంటి దారుణ ఘటనలూ జరిగాయి. అయినా సరే.. జగన్మోహన్ రెడ్డి స్పందించారా? దోషులపై చర్యలేమైనా తీసుకున్నారా? ఏదీ లేదు. మరి వీటన్నింటినీ ఒక్క విగ్రహం మాటున దాచేస్తారా? పోనీ దాస్తే దాగేవా అవన్నీ? అంబేడ్కర్ విగ్రహం అన్యాయమైపోయిన వారి కుటుంబాల కన్నీళ్లు తుడుస్తుందా? అంబేడ్కర్ విగ్రహ నిర్మాణమన్నది గొప్ప విషయమే కానీ రాష్ట్రంలో అభివృద్ధి ఏది? పక్క రాష్ట్ర సీఎం దావోస్, లండన్‌లు తిరుగుతూ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే జగన్ ఏం చేస్తున్నారు? ఉద్యోగ కల్పన ఎలా? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది? చాలా సమాధానం లేని ప్రశ్నలు. వీటన్నింటినీ 206 అడుగుల విగ్రహం దాచేయగలదా?