నియోజకవర్గాల ఇన్‌చార్జుల మార్పు, బదిలీ అంశం వైసీపీలో సునామీనే సృష్టిస్తోంది. వైసీపీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవి వంటి వారి రాజీనామాలతో మొదటి దఫా ముగిసింది. తాజాగా రెండో దఫా రాజీనామాల పర్వం మొదలైంది. ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలైన రాజీనామాల పర్వానికి అంతమెప్పుడో తెలియడం లేదు. అసలు ఎప్పుడు ఏ నేత రాజీనామా చేస్తారో తెలియని పరిస్థితి వైసీపీలో నెలకొంది. ఏపీలో ఎన్నికలు ఆసన్నమవుతున్న తరుణంలో ఈ రాజీనామాలు ఆ పార్టీని నిరుత్సాహంలో ముంచెత్తుతున్నాయి. ఎన్నికలకు మూడు నెలలు కూడా సమయం లేదు. ఈ లోపే ఎంత మంది కీలక నేతలు రాజీనామాల దిశగా అడుగులు వేస్తారన్నది ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
ఆ నిర్ణయం తీసుకుంటే ఊరుకుంటారా?
నిజానికి నియోజకవర్గాన్ని వదులుకోవాలని ఏ నేత అనుకోరు. ఏదో జనం ఎన్నికల్లో ఓడిస్తేనే అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కూడా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో అయినా లబ్ది పొందాలనుకుంటారు తప్ప నియోజకవర్గంపై పట్టును కోల్పోవాలని మాత్రం అనుకోరు. మరి అధినాయకత్వం ఆ నిర్ణయం తీసుకుంటే ఊరుకుంటారా? వ్యతిరేకిస్తారు. తన ఇంట్లో బయటివాడు వచ్చి పెత్తనం చేస్తానంటే ఎవరు సహిస్తారు? ఇప్పుడు వైసీపీలోనూ అదే జరుగుతోంది. వైసీపీలోనే కాదు.. ఏపార్టీలోనైనా ఇదే తరహా తీరు ఉంటుంది. ప్రస్తుతం జగన్ నాలుగు లిస్ట్‌లను విడుదల చేశారు. వాటిలో సిట్టింగ్‌లను చాలా మందిని తప్పించారు. ఇప్పుడు వారంతా వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నారు. రాజీనామాల దిశగా అడుగులు వేస్తున్నారు.
పామూరులో వైసీపీ కేడర్ సమావేశం
తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీలో ముసలం చోటు చేసుకుంది. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌కు మద్దతుగా నేతలు, కేడర్ రాజీనామాలకు సైతం తెరదీస్తున్నారు. తాజాగా పామూరులో వైసీపీ కేడర్ సమావేశమైంది. బుర్రా మధుసూదన్‌కి మద్దతుగా అక్కడి ఎంపీపీ లక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు హుసేన్ రెడ్డి రాజీనామాలు ప్రకటించారు. వైసీపీ అధిష్టానం బుర్రా మధుసూధన్‌కి హ్యాండ్ ఇచ్చింది. ఆయనకు టికెట్ కేటాయించకుండా ఆయన స్థానంలో కనిగిరి ఇన్‌చార్జిగా దద్దాల నారాయణ పేరును నాలుగో జాబితాలో ప్రకటించింది. అది అక్కడి నేతల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిపై ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ వర్గమంతా ఆగ్రహంతో ఉంది.