జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం రోజు అన్నదానం కోసం అయ్యే రూ. 50 కోట్ల ఖర్చంతా తానే పెట్టుకుంటానని ప్రభాస్ ముందుకు వచ్చినట్లుగా ఓ వార్త వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. అతిథ్యం, ఫుడ్ గురించి వినిపించే ముందు కృష్ణంరాజు పేరు, ఆ తర్వాత ప్రభాస్ పేరే వినిపిస్తుంది. అందులోనూ ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రపంచానికి ప్రభాస్ రాముని అవతారంలో కనిపించాడు. ఇప్పుడు రాముని గుడి విషయంలో ప్రభాస్ పేరు వినబడగానే అంతా నిజమే అని అనుకుని ప్రభాస్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే ప్రభాస్ నుండి మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు. ఇదే విషయంపై ప్రభాస్ సన్నిహితులను సంప్రదించగా.. అలాంటిదేమీ లేదనే వార్త బయటికి వచ్చింది. అలాంటి అవకాశం వస్తే.. ప్రభాస్ అసలు వెనకడుగు వేయడు కూడా. కానీ ప్రభాస్ వరకు ఆ అవకాశాన్ని రానిస్తారా? ఈ రామ మందిర నిర్మాణం ఇప్పుడు బీజేపీకి ప్రధానాస్త్రం. ఏదైనా తమ చేతుల్లోనే జరగాలని చూస్తారు కానీ.. ఇతరుల వరకు రానివ్వరు. జరుగుతుంది కూడా అదే. అలాంటిది భోజన ఖర్చులకు ప్రభాస్‌కు ఛాన్స్ ఇస్తారా? అనేలా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి, ఇతర దేశాల నుంచి కోట్లాది మంది రామ భక్తులు అయోధ్యకు రానున్నారు. ప్రపంచానికి ఈ రామ మందిర విశిష్టత తెలియజేసేలా.. అయోధ్యలో కార్యక్రమాలను స్వయంగా ప్రధాని మోదీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిజంగా భోజనాలకు రూ. 50 కోట్లు అవుతాయంటే.. విరాళం ఇవ్వడానికి పెద్ద తలకాయలు ఎందరో వేచి చూస్తున్నారు. ఎందుకంటే, ఇది దైవ కార్యం కదా..