రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సలార్ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. రిపబ్లిక్ డే కి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అనుకున్నారు కానీ.. అంతకంటే ముందే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. అదీ ఎప్పుడో కాదు.. ఈ రోజు రాత్రి (శుక్రవారం అర్థరాత్రి) నుండే సలార్ ఓటీటీలో సందడి చేయనుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా దాదాపు రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి.. మరోసారి ప్రభాస్ సత్తా చాటింది.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ప్రేక్షకలోకం ఎదురు చూస్తోంది. జనవరి 26న రిపబ్లిక్ డే స్పెషల్‌గా ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అంతకంటే ముందే ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్‌కు సిద్ధం చేయడంతో.. ఫ్యాన్స్, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ మంచి ఆదరణ పొందుతుందని అటు మేకర్స్, ఇటు ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఖాన్సార్ సామ్రాజ్య చక్రవర్తి రాజమన్నార్ (జగపతిబాబు), తన కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)ని తన తర్వాత చక్రవర్తిగా చూడాలని అనుకుంటాడు. ఆయన కొన్నాళ్లు పాటు సామ్రాజ్యం వదిలి వెళ్లడంతో అక్కడి పరిస్థితులన్నీ మారిపోతాయి. రాజమన్నార్‌ని చంపి కుర్చీ కైవసం చేసుకోవాలని మిగతా చక్రవర్తులు చేసే కుట్రలని ఎదుర్కొనేందుకు.. రాజమన్నార్ తన చిన్ననాటి స్నేహితుడు దేవా(ప్రభాస్) సాయం తీసుకుంటాడు. తన మిత్రుడి కోసం దేవా ఏం చేశాడు? అసలెందుకు దేవా ఎక్కడో బతుకుతుంటాడు? వంటి ప్రశ్నలకు సమాధానంతో పాటు.. అసలా కుర్చీకి వారసుడు దేవానే అని రివీల్ చేసిన తీరు సలార్ సెకండ్ పార్ట్‌పై క్యూరియాసిటీని కలిగించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించారు.