రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు సమ వయస్కులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అలాగే ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు.. ఇద్దరూ జైలుకి వెళ్లొచ్చిన వారే.. ఇలా ఇద్దరు సీఎంలకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ విడిపోయిన నాటి నుంచి ఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మరొక ప్రభుత్వంతో కంపేర్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. నిజానికి నాలుగున్నరేళ్ల జగన్ పాలనతో రేవంత్ పాలనను పోల్చడం సరికాదు కానీ తెలుగు ప్రజానీకం ఊరుకుంటుందా? ప్రతి చిన్న విషయాన్ని పోలుస్తూ పోతోంది. పైగా రెడ్డి సామాజిక వర్గమైతే రెండు రాష్ట్రాల పాలనపై మరింత ఫోకస్ పెట్టింది. ఇద్దరు రెడ్డిలలో ఎవరి పాలన బాగుందని పట్టి పట్టి చూస్తోంది.
ఇది ఎవర్ గ్రీన్ పథకం..
జగన్ అయితే సంక్షేమ పాలన కొనసాగిస్తూ దూసుకెళుతున్నారు. అభివృద్ధి ఊసు అయితే మరిచారు. ఇక రేవంత్ అంటే వచ్చీ రాగానే ఆయన కూడా సంక్షేమ పథకాలతోనే పాలన ప్రారంభించారు. అయితే అభివృద్ధి విషయం మాత్రం మరికొంత కాలం ఆగితే కానీ తెలియదు. అయితే రేవంత్ ఒకే ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు. అది అద్భుతమైన ఫలితాన్ని సాధించింది. జగన్ ఇంతకాలం ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా రాని మైలేజ్.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో రేవంత్‌కు వచ్చింది. నిజానికి ఇది ఎవర్ గ్రీన్ పథకం. బాగా వర్కవుట్ అయ్యింది. పైగా ఫ్రీ పబ్లిసిటీ రేవంత్ ప్రభుత్వానికి వచ్చేసింది.
ఫలితం అంతగా రావడం లేదు..
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించని మహిళలు ఎవరున్నారు? ఐదేళ్ల పాటు ఈ పథకం కొనసాగితే రేవంత్ పాలనకు మహిళలు పూర్తిగా అండగా ఉంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ ఫ్రీ బస్ పథకం కారణంగా పెద్దగా ఆర్టీసీకి నష్టం కూడా రావడం లేదని టాక్. మహిళలతో పాటు వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉండటంతో రెవెన్యూ పెరిగిందట. దీంతో ఈ ఫ్రీ బస్సు పథకానికి మించిన పథకాలు జగన్ ప్రవేశ పెడుతున్న ఫలితం అంతగా రావడం లేదు. పైగా జగన్ పథకాలకు వలంటీర్ వ్యవస్థ అనేది ఒక మైనస్. మొత్తానికి సంక్షేమం విషయంలో జగన్ దేశంలోనే అందరి కన్నా ముందున్నా ఎంచుకున్న పథకాలతో మాత్రం తెలంగాణ కంటే వెనుకబడే ఉన్నారు.