లెజెండ్ నందమూరి తారక రామారావు వర్ధంతి (జనవరి 18) సందర్భంగా ఎప్పటిలానే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం ఉదయమే ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి పుష్పగుచ్ఛాలతో అంజలి ఘటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు, నటరత్న నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా అందరం కదిలి తిరిగి రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ కుమార్తె, తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి అయిన నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. ఆమె వెంట పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ తమ కుటుంబ సభ్యులతో ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని, పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు.
తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి ఘాట్ వద్దకు చేరుకుని తాతయ్య నందమూరి తారక రామునికి నివాళులర్పించారు. నందమూరి తారకరత్న వైఫ్ అలేఖ్యా రెడ్డి కూడా ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి, నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. వీరితో పాటు నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుని.. నందమూరి తారక రాముడిని తలుచుకుంటూ ఘనంగా నివాళులు సమర్పించారు.