కొంతమందికి నీతులు ఏమాత్రం సెట్ కావు. అలాంటి వారిలో ముందు వరుసలో వైసీపీ నేతలు ఉంటారు. కొట్టడాలు, నరకడాలు, మనుషులను మర్డర్ చేసి డోర్ డెలివరీ చేయడంలో సిద్ధహస్తులైన నేతలకు నీతులు చెప్పడం కూడా కొట్టిన పిండే అనడంలో సందేహం లేదు. తాజాగా వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి భారీ నీతులకు తెరదీశారు. ఇంట్లో ఆడవారి జోలికి వెళ్లిన వారిని విడిచిపెట్టొద్దంటూ నీతులు వల్లించారు వైసీపీ నేత బైరెడ్డి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. నీతులు బయటి వారికేనా? మీ పార్టీ వారికి వర్తించవా? అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున బైరెడ్డిని ఏకి పారేస్తున్నారు.
అప్పుడు చెవులు మూసుకున్నావా?
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన తల్లిని దూషించారని గతంలో చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు వారి పంచనే చేరారంటూ బైరెడ్డి దుయ్యబట్టారు. మన కుటుంబంలోని ఆడవారిని ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే నిలువునా నరుకుతామని రెచ్చగొట్టేలా గురువింద వ్యాఖ్యలైతే చేశారు. ఇవి విన్న ప్రజానీకం వైసీపీ నేతలు ప్రతిపక్ష నేతల కుటుంబంలోని ఆడవారిపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుని మరీ ఏకి పారేస్తున్నారు. ఇంత బుద్ధి ఉన్నప్పుడు వారి కుటుంబంలోని ఆడవారిని నిండు సభలో తూలనాడినప్పుడు చెవులు మూసుకున్నావా? అంటూ ఫైర్ అవుతున్నారు.
అధినేతకు నీతులు చెప్పలేదేం బైరెడ్డి?
మాట మాట్లాడితే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన స్థాయిని మరిచి మరీ పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలతో సంబంధం లేని ఆడవారిని రోడ్డుకు లాగినప్పుడు అధినేతకు నీతులు చెప్పలేదేం బైరెడ్డి? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. నిండు సభలో ప్రతిపక్ష నేత సతీమణిని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసినప్పుడు నిద్ర పోయావా? అంటూ ఫైర్ అవుతున్నారు. పోనీ జగన్ కుటుంబంలోని ఆడవారిని ఆ పార్టీ నేతలు ఏమైనా వదిలారా? స్వయంగా జగన్ వ్యాఖ్యలు చేయకున్నా కూడా ఆయన సోదరీమణులైన షర్మిల, వివేకా కూతురు సునీతలను సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వైసీపీ నేతలే ట్రోల్ చేస్తున్నారు. మరి ఆ ఆడబిడ్డలందరి కన్నీళ్లు బైరెడ్డి కంటికి కనిపించవా? అంటూ ఓ రేంజ్‌లో జనం మండిపడుతున్నారు.