వైసీపీ బీసీ కార్డ్ అందుకుంది. బీసీలకే టికెట్ల కేటాయింపులో పెద్ద పీట వేస్తున్నామని ప్రకటించింది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా బీసీ జపం చేస్తున్నారు. అయితే ఆయన మాటల్లో ఉన్నంత ఆదరణ.. నిజంగానే బీసీలపై ఉందా? బీసీ నేతలకు ఆయన ఎంత మేర ప్రాధాన్యమిస్తున్నారు? వంటి అంశాలు తెలియాలంటే ఒకసారి నిజనిర్ధారణ చేయాల్సిందే. వైసీపీలో కొనసాగాలంటే పక్కాగా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ప్రత్యర్థులను అవసమున్నా లేకున్నా బూతులు తిట్టాలి. అవసరమైతే భౌతిక దాడులకు వెనుకడుగు వేయకూడదు. జగన్ దగ్గర మాత్రం అణిగిమణిగి ఉండాలి. ఈ క్వాలిటీస్ ఉన్నవారికే సీట్లు.
బీసీలకే అధిక ప్రాధాన్యం..
ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గ ఇన్‌చార్జుల నియామకంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు జాబితాలను జగన్ విడుదల చేశారు. ఈ జాబితాల్లో బీసీలకే అధిక ప్రాధాన్యమంటూ వైసీపీ అధినేత ఊదరగొడుతున్నారు. తాజాగా విడుదల చేసిన మూడో జాబితాలో బీసీ అయిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి పేరు లేదు. ఆయన స్థానంలో మంత్రి జోగి రమేశ్ నియామకం జరిగింది. మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుంటే పార్థసారధి ఓకే అనుకున్నారు కానీ చివరకు ఎమ్మెల్యే టికెట్ కూడా నిరాకరించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన తన ఆవేదనను మీడియా వద్ద వ్యక్తం చేశారు.
బాంచెన్ దొర నీ కాల్మొక్తా..
తాను ప్రత్యర్థులను బూతులు తిట్టబోనని.. దాడులు చేయనని అందుకే తనను తీసి జగన్ పక్కన పడేశారన్నారు. ఈసారి గన్నవరంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేకనే తనను అక్కడి నుంచి పోటీ చేయమని అంటున్నారన్నారు. బీసీని కనుకనే తాను ఓడిపోయినా పర్వాలేదని లైట్ తసీుకున్నారని పార్థసారధి అంటున్నారు. బీసీని కనుక ‘బాంచెన్ దొర నీ కాల్మొక్తా’ అని అన్నట్లుండాలంటే తానుండలేనన్నారు. ఇదే అభిప్రాయాన్ని బీసీ అయిన వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైసీపీలో బీసీలకు గౌరవం ఇవ్వడమంటే ఏదో ఒక పదవి పడేస్తారని.. అది కేవలం ప్రజలకు చెప్పుకోవడానికేనన్నారు. అందుకు తప్ప దేనికీ పనికిరాదని.. గౌరవం లేని చోటు ఉండలేక పార్టీని వీడుతున్నానని సంజీవ్ కుమార్ తెలిపారు.