టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల ద్వయం ఒకవైపు.. వైసీపీ అధినేత, సీఎం జగన్ మరోవైపు ఏపీలో పావులు కదుపుతున్నారు. ఎవరికి తోచిన రాజకీయం వారు చేస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో ఒక గేమ్ ఆడాలని జగన్ ట్రై చేశారు కానీ వర్కవుట్ కాలేదు. కాపుల సపోర్ట్ జనసేనకు ఉండకూడదన్న కృతనిశ్చయంతో ఆయన ముద్రగడను దగ్గరకు తీశారు. ఎమ్మెల్యే సీటు ఆశ పెట్టారు. దీంతో ముద్రగడ సైతం వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు. ఆయనకు ఆ సమయంలో జగన్ ఇచ్చిన ప్రాధాన్యాన్ని అలా కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది కానీ అలా చేయలేదు.
ముద్రగడకు సినిమా అర్థమైంది..
ఇప్పుడే కాదు.. గతంలోనూ ముద్రగడ వ్యవహారంలో జగన్ ఇలాగే చేశారు. వైసీపీలో ప్రాధాన్యం కల్పిస్తామని.. తమ పార్టీ తరుఫున అభ్యర్థిగా పోటీ చేస్తే ఎన్నికల ఖర్చు సైతం తామే భరిస్తామన్నారు. కానీ ఆ తరువాత పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు కూడా అంతే. టికెట్ కేటాయిస్తాన్న జగన్.. తన మూడో లిస్ట్‌లో సైతం ముద్రగడ పేరును చేర్చలేదు. దీంతో ముద్రగడకు సినిమా అర్థమైంది. కట్ చేస్తే.. వైసీపీకి ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన నేతలు సైతం ఆయన నివాసానికి వెళ్లి మాట్లాడారు. దీంతో ఆయన జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే తాజాగా ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది.
టీడీపీ, జనసేనల్లో ఏదో ఒక పార్టీలో చేరుతా..
టీడీపీ, జనసేన నేతలు ముద్రగడను సంప్రదించారని తెలియగానే.. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆయనతో మాట్లాడేందుకు యత్నించారు. దీనికి ముద్రగడ నుంచి అనూహ్య సమాధానం వచ్చిందట. వైసీపీతో తనకు సెట్ కాదని.. టీడీపీ, జనసేనల్లో ఏదో ఒక పార్టీలో చేరుతానని.. లేదంటే ఇంట్లో కూర్చొంటాను తప్ప వైసీపీలో చేరే ప్రసక్తే లేదని చెప్పినట్టు సమాచారం. మొత్తానికి ముద్రగడను జగన్ కాపాడుకోగలిగితే అంతో ఇంతో కాపు సామాజిక వర్గం ఆయనతో ఉండేది కానీ ఆ ఛాన్స్ ఆయన పోగొట్టుకున్నారు. ఇప్పుడు జనసేనకు ఉన్న కాస్త లోటు కూడా లేకుండా పోయింది. ముద్రగడ ఎంట్రీ ఇస్తే మాత్రం పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గం జనసేనకు సపోర్టు చేయడం ఖాయం అంటున్నారు.