వైసీపీ అభ్యర్థుల జాబితా విషయంలో దూసుకెళుతోంది. ఇక టీడీపీ సైతం అభ్యర్థుల జాబితాపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. సంక్రాంతి నాటికి తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ తొలి జాబితాలో అయితే సంచలనాలకు తావైతే ఉండదని సమాచారం. పక్కాగా పోటీ చేసే 20-25 మందితో కూడిన జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక తొలి లిస్ట్‌లో టీడీపీ కీలక నేతలంతా ఉండే అవకాశం ఉంది. కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి లోకేశ్, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు ఫిక్స్. వీరి స్థానాల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని అయితే తెలుస్తోంది. ఇక ఎవరెవరి పేర్లతో జాబితా విడుదలవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
టికెట్ల విషయమై సంకేతాలిస్తున్న బాబు..
ఇక మలి జాబితా వచ్చేసి ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ‘రా కదలిరా’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో జనంలో ఉండేందుకే సమయం వెచ్చిస్తున్నారు. ఈ సభల ద్వారానే టీడీపీ టికెట్లు ఎవరెవరికి లభించబోతున్నాయనే విషయంలోనూ చంద్రబాబు సంకేతాలిస్తున్నారు. కనిగిరికి ఉగ్ర నరసింహారెడ్డి, తిరువూరుకు శ్యావల దేవదత్, ఆచంటకు పితాని సత్యనారాయణ, ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, బొబ్బిలికి బేబి నాయన, తునికి యనమల దివ్య, వెంకటగిరి ఇన్‌చార్జి కురుగుండ్ల రామకృష్ణ ఇన్‌చార్జులుగా ఉన్నారు. వీరికే ఈసారి టీడీపీ టికెట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
గ్రూపులు ఎక్కువే..
అలాగే ఉరవకొండకు పయ్యావుల కేశవ్, గుడివాడకు వెనిగళ్ల రామ్మోహన్, కమలాపురం నియోజకవర్గానికి పుత్తా నరసింహారెడ్డి, పత్తికొండకు కేఈ శ్యాంబాబు, అరకుకు దన్ను దొర, మండపేటకు వేగుళ్ల జోగేశ్వరరావు, పీలేరుకు నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి, పొన్నూరుకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కోవూరుకు పోలంరెడ్డి దినేశ్ రెడ్డి, గోపాలపురం నియోజకవర్గానికి మద్దిపాటి వెంకటరాజు, గంగాధర నెల్లూరుకు డాక్టర్ థామస్, మాడుగులకు పీవీజీ కుమార్, టెక్కలికి కింజరాపు అచ్చెన్నాయుడు, ఉంగుటూరుకు గన్ని వీరాంజనేయులు, చీరాలకు కొండయ్య యాదవ్ ఇన్‌చార్జులుగా ఉన్నారు. వీరిలో మద్దిపాటి వెంకటరాజుకు, కొండయ్య యాదవ్‌కు టికెట్ దక్కే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో గ్రూపులు కాస్త ఎక్కువే. వీరికి టికెట్ కేటాయిస్తే మరో వర్గం సహించే పరిస్థితి లేదు.