గట్టు దాటగానే బోటు తగలేసే వారు రాజకీయాల్లో చాలా మందే ఉంటారు. గతంలో కొడాలి నాని తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని వీడారు. వీడితే వీడారు కానీ ఆయన చేసిన విమర్శలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శలు కాదు.. దారుణాతి దారుణమైన బూతులు. అందుకే బూతుల నేత అనగానే కొడాలి నాని గుర్తుకు వస్తారు. ఇప్పుడు ఈ కోవలోకే విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా చేరిపోయారు. సైకిల్ దిగి ఫ్యాన్ కింద కూర్చున్నారు ఓకే. కానీ అలా గట్టు దాటారో లేదో ఇలా విమర్శలేల? నిన్న మొన్నటి వరకూ టీడీపీ ఎలాంటి పార్టీయో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి వారో తెలియలేదా? ఇప్పుడే చంద్రబాబులోని దుర్మార్గుడు కనిపించాడా?
స్వతంత్రంగా గెలిచేంత సీన్ లేనట్టేగా?
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. విజయవాడ సీటును వేరొకరికి కేటాయిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఇక అంతే అప్పటి వరకూ రాముడిలా కనిపించిన చంద్రబాబు ఒక్కసారిగా రావణాసురుడు అయిపోయారు. పార్టీకి రాజీనామా చేసిన వెంటనే వెళ్లి వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. ఆయన కూడా ఈయన రాక కోసం వేచి చూస్తున్నారు. ఇద్దరూ కలిశారు. అక్కడ ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బయటకు వచ్చిన వెంటనే కేశినేని నాని మాటల బాణాలను ఎక్కుపెట్టారు. అసలు ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసి గెలవగల దిట్టను అంటూ ప్రగల్భాలు పలికి.. జగన్ పంచన చేరడమే ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంటే స్వతంత్రంగా గెలిచేంత సీన్ లేనట్టేగా? టీడీపీ అండ లేకుండా ఆయన విజయం సాధించలేడన్నట్టే కదా.
పలచనైపోతామన్న స్పృహ కూడా లేకుంటే ఎలా?
ఇక వైసీపీ కండువా కప్పుకున్నారో లేదో గంగ.. చంద్రముఖిలా మారినట్టు కేశినేని నాని వైసీపీ నానిల్లో ఒకరైపోయారు. చంద్రబాబు, నారా లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ ఆఫ్ట్రాల్ అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తాత, తండ్రి పేర్లు చెప్పుకుని నారా లోకేష్ రాజకీయ అడుగులు వేశాడని.. అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయాడని ఆరోపించారు. అసలు ఏ అర్హతతో లోకేష్ పాదయాత్ర చేశారంటూ ప్రశ్నించారు. పైగా టీడీపీ కారణంగా రూ.2000 కోట్లు నష్టపోయారట. అన్ని కోట్లు నష్టపోతున్న విషయం కేశినేని నానికి తెలియలేదా? చంద్రబాబు ఏపీకి అవసరం లేదట. ఆయన రెస్ట్ తీసుకుంటే బెటరంటూ విమర్శలు. పార్టీ మారగానే ఇలా విమర్శలు గుప్పిస్తే జనంలో పలచనైపోతామన్న స్పృహ కూడా లేకుంటే ఎలా? మొత్తానికి కేశినేని నాని అయితే పూర్తి స్థాయి వైసీపీ నేతలా మారిపోయారు.