ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న వైసీపీ నేతలు..
ఏపీ సీఎం జగన్ ముందుగా అభ్యర్థుల జాబితా పనిని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇది పూర్తైతే ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలోకి దిగవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మూడో విడత నియోజకవర్గ ఇన్‌చార్జుల నియమకానికి సంబంధించిన లిస్ట్ తయారు చేసే పనిలో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో పలువురి అభ్యర్థుల నియామకం జరిగింది. దీనిలో మార్పులు చేర్పులే పార్టీలో కల్లోలం రేపాయి. ఇప్పుడు మూడో విడత లిస్ట్‌పై అందరూ ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా తొలి రెండు విడతల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను సైడ్ చేశారు. సర్వేలు అనుకూలంగా లేవనే కారణం చెప్పి వారిని తప్పించేశారు.
తాడేపల్లికి క్యూ కడుతున్న నేతలు..
ఇక మరికొందరు వైసీపీ నేతలకు నియోజకవర్గాలు మార్చేశారు. ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మూడో జాబితాలో ఎవరు బలిపశువులు అవుతామా? అని తెగ ఆందోళన చెందుతున్నారు. ఈ లిస్ట్‌లో 25-30 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులంతా తాడేపల్లికి క్యూ కడుతున్నారు. వీరిలో కొంతమందికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కొంతమంది మాత్రం టెన్షన్ భరించలేక జగన్ క్యాంపు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్‌ను అయితే సైడ్ చేసినట్టు సమాచారం. ఆయన స్థానంలో మేరిగ మురళీధర్‌కు అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది.
మూడో లిస్ట్‌లో పలువురు నేతలకు దక్కని స్థానం..!
ఈ దఫా లిస్ట్‌లో సైతం సిట్టింగ్‌లు పలువురిని తప్పించినట్టు సమాచారం. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్‌ని తప్పించి ఆయన స్థానంలో డాక్టర్ సుధీర్, మార్కాపురం ఎమ్మెల్యే కె.నాగార్జున రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో జంకె వెంకటరెడ్డిని, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పక్కన పెట్టి ఆయన స్థానంలో మంత్రి బొత్స బంధువైన మజ్జి శ్రీనివాసరావుకు సీట్లు కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. ఇవాళ కూడా సీఎం పిలుపు మేరకు తాడేపల్లికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వచ్చారు. అలాగే..
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, హిందూపురం ఎంపీ గోరంట్లమాధవ్ తదితరులు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే పలువురు టికెట్ దక్కని నేతలు మండిపడుతున్నారు. ఇక మూడో లిస్ట్‌లో తమ పేరు ఉంటుందా? లేదా? అని వైసీపీ నేతలంతా ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.