పరిస్థితులన్నీ టీడీపీ, జనసేనకు ఫేవర్‌గా ఉన్నాయనిపించినా కూడా టర్న్ అవడానికి పెద్ద సమయమేమీ పట్టదు. తెలంగాణలో కేవలం 4 నెలల్లోనే పరిస్థితులన్నీ మారిపోయాయి. సోదిలోనే లేని కాంగ్రెస్ పార్టీ రయ్‌మని దూసుకొచ్చి అధికార పీఠాన్ని అధిరోహించింది. ఏపీ విషయంలోనూ ఇలాగే ఏమైనా జరగొచ్చు. కాబట్టి టీడీపీ, జనసేనలు అలర్ట్‌గా ఉండాల్సిందే. అన్న వదిలిన బాణం దిశ మార్చుకుని అన్న కంటినే పొడిచేందుకు సిద్ధమైందిలే అని ఆనందంగా ఉంటే టీడీపీ, జనసేనలకే నష్టం కావొచ్చు. దిశ మార్చుకున్న బాణం ఎటైనా తిరగొచ్చు. ఎవరికైనా లాభం చేకూర్చవచ్చు.. ఎవరినైనా ముంచేయవచ్చు.
నష్టమంతా జగన్‌కే అనుకోవడానికి లేదు..
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అవసరం తీరాక ఆర్థికంగానూ.. రాజకీయంగానూ చెల్లి షర్మిలను దెబ్బ కొట్టడంతో జగనన్న బాణం తెలంగాణ బాట పట్టింది. షర్మిల అక్కడ వైఎస్సార్‌టీపీని స్థాపించారు. ప్రయోజనం లేక తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇప్పుడు తిరిగి ఏపీకే చేరుకున్నారు. అయితే షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టారు కాబట్టి జగన్‌కు నష్టమంతా అని అనుకోవడానికి లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిందా? టీడీపీ, జనసేనలకు లాభం. కానీ అలా జరగకుంటే? షర్మిల కాంగ్రెస్‌లోకి వచ్చారు కదాని ఆర్కే వంటి పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరతారనడంలో సందేహం లేదు.
గత ఎన్నికల్లోనూ ఇదే వ్యూహం..
కొందరు నేతలు జగన్‌తో ఉండలేక.. నిన్న మొన్నటి వరకూ తిట్టిన టీడీపీ, జనసేనల్లో చేరలేని వారికి కాంగ్రెస్ పార్టీ ఇక మీదట ప్రత్యామ్నాయం కాబోతోందనడంలో అనుమానమే లేదు. ఇలాంటి సమయంలో చాలా అలర్ట్‌గా ఉండాలి. షర్మిల వలన నష్టం రాకపోవచ్చేమో కానీ టీడీపీ, జనసేనల ఫోకస్ షర్మిల వైపు మళ్లించి వైసీపీ పనులు చక్కబెట్టుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల్లోనూ వైసీపీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. కోడికత్తి, వివేకా హత్య, టీవీ డిబేట్స్, విశ్లేషణల వంటి వాటిపైకి ఈ పార్టీలను డైవర్ట్ చేసి చక్కగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా అంతా బాగానే ఉంది కదా అని గురి తప్పిందో టీడీపీ, జనసేన పొత్తు కట్టినా ఉపయోగం ఉండదు.