టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎన్నికల సమయంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తన కూతురు చేత కూడా రాజీనామా చేయించారు. అసలు ఇప్పుడు రానున్న ఎన్నికలు పార్టీ మనుగడకు అత్యంత కీలకం. పైగా టీడీపీకి అంతా ఫేవర్‌గా ఉంది. ఈ తరుణంలో ఎందుకు విజయవాడ ఎంపీ స్థానం విషయంలో చంద్రబాబు మార్పులు చేయాలనుకున్నారు? ఎందుకు కేశినేని నానిని తిరువూరు సభ విషయంలో జోక్యం చేసుకోవద్దన్నారు? ఎందుకు కేశినేని నాని మనస్తాపం చెందినా పట్టించుకోలేదు? ఎందుకు పార్టీ మారుతానని ప్రకటించినా కూడా కేశినేని నానితో మాట్లాడలేదు? అన్నీ ప్రశ్నలే..
నిజంగానే పొమ్మనలేక పొగబెట్టారా?
కేశినేని నానికి పొమ్మనలేక టీడీపీ పొగబెట్టిందంటూ అధికార పక్షం ప్రచారం చేస్తోంది. మరి నిజంగానే పొమ్మనలేక పొగబెట్టారా? అంటే కాదనే చెప్పాలి. రెండు పర్యాయాలు గెలిచిన వ్యక్తి.. పైగా అనుచరగణం బీభత్సంగా ఉన్న వ్యక్తిని ఏ పార్టీ అయినా ఎందుకు వదులుకుంటుంది? గత కొంతకాలంగా కేశినేని నాని ఎడమొహం.. పెడమొహంగానే టీడీపీతో ఉంటున్నారు. దీనికి కారణం.. ఆయన తన ఇంటి వ్యవహారాన్ని రాజకీయాల్లోకి లాగడమే. తమ్ముడు కేశినేని చిన్నితో ఆయనకు పడదు. అది వారి కుటుంబ వ్యవహారం. రాజకీయాల్లో కేశినేని చిన్ని చాలా యాక్టివ్‌గా ఉంటారు. పార్టీ వ్యవహారాలన్నీ చాలా యాక్టివ్‌గా చూసుకుంటారు.
ఎవరికైనా విసుగు రాదా?
అలాంటి చిన్నికి టీడీపీలో ప్రాధాన్యమివ్వొద్దనేది కేశినేని నాని ఆలోచన. ఆయన ప్రాధాన్యం పెరుగుతోందని సహించలేకపోయారు. ఈ విషయంలో చాలా సార్లు చంద్రబాబు ఆయనకు నచ్చజెప్పారు. ఇతర నేతలను కేశినేని నాని వద్దకు పంపించి చెప్పించారు. ఎప్పటికప్పుడు ఓకే అన్నట్టుగా ఉన్నా కూడా మళ్లీ కథ మొదటికే. తొలుత బుద్దా వెంకన్న విషయంలోనూ ఇదే జరిగింది. అప్పట్లో కేశినేని నానికి, బుద్దా వెంకన్నకు ఏమాత్రం పడేది కాదు. ట్విటర్ వార్ పెద్ద ఎత్తున జరిగింది. చంద్రబాబు సూచనలతో బుద్దా వెంకన్న సైలెంట్ అయిపోయారు. దీంతో కేశినేని నాని కూడా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు తమ్ముడితో వ్యవహారం ఇంటి వరకూ ఉంటే బాగుంటుంది. ప్రతిసారీ చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పలేరు కదా. ప్రతిసారీ రాజీనామా సంకేతాలు ఇస్తూనే ఉంటే ఎలా? ఎవరికైనా విసుగు రాదా? అందుకే చంద్రబాబు సైలెంట్ అయిపోయారని సమాచారం.