ఏ ప్రభుత్వానికైనా రెండు పర్యాయాలు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంతకు మించి అంటే బంపరాఫర్ తగిలినట్టే. అది ఎక్కడో కానీ జరగదు. బీఆర్ఎస్ పార్టీకి ఈ బంపర్ ఆఫర్ వరిస్తుందని ఆ పార్టీ నేతలు చూశారు కానీ జరగలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను గ్రహించలేక బోల్తా పడ్డారు. బీఆర్ఎస్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. అవన్నీ జనాలకు తెలిసినవే. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక లోక్‌సభ ఎన్నికల విషయంలోనైనా ఏ పొరపాటూ జరగకుండా చూడాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో సైతం ఓటమి పాలైతే బీఆర్ఎస్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది.
కొందరు నేతల్లో ఆందోళన.. కొందరిలో ఆశలు..
అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకు పెద్ద పీట వేయడం కూడా బీఆర్ఎస్‌కు నష్టం తెచ్చి పెట్టింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆ తప్పు జరగకూడదని ఎంపీ స్థానాల్లో మార్పులకు చేర్పులకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. సిట్టింగ్‌లను నమ్ముకుంటే మరోసారి చిక్కుల్లో పడతామని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు నేతల్లో ఆందోళన.. మరికొందల్లో నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమ సీటు ఎక్కడ గల్లంతవుతుందోనని సిట్టింగ్ ఎంపీలు భయపడుతున్నారు. అలాగే సిట్టింగ్‌లను ఈసారి తప్పిస్తే తమకు అవకాశం వస్తుందని కొందరు నేతలు ఆశపడుతున్నారు.
మార్చాక ఫలితం మారిపోతే ఎలా?
ఇక కేసీఆర్ మనసులో ఏముందనేది మాత్రం తెలియరావడం లేదు. తెలంగాణను చూసి ఏపీలో సీఎం జగన్ సిట్టింగ్‌లను మార్చడంతో అక్కడ పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. అలాంటి పరిస్థితే తెలంగాణలోనూ తిరిగి తలెత్తితే ఎలా? సిట్టింగ్‌ల మార్పు నిర్ణయం ఎవరిని నొప్పిస్తుందో.. ఎవరిని మెప్పిస్తుందో..? మార్చాక ఫలితం మారిపోతే ఎలా? వంటి అంశాలు గులాబీ బాస్‌ను కలవరపెడుతున్నాయట. అసెంబ్లీ తరహా తీర్పే లోక్‌సభ ఎన్నికల్లోనూ రిపీట్ అయితే కేంద్రంలో కూడా తమకు ఇబ్బందికర పరిస్థితులే తలెత్తుతాయి. కాబట్టి ఆచి తూచి అడుగేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీనికోసం పార్టీ అగ్ర నేతలతో సమాలోచనలు చేస్తున్నారట. ఇక చూడాలి చివరకు కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో..