కొంతమంది రీజన్ పెద్దది కాకపోయినా.. చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటారు. చిన్న తగాదాలతో క్షణికావేశంలో సూసైడ్ నిర్ణయం తీసుకుని తమ ఆప్తులకి, అయినవారికి బాధని మిగులుస్తారు. పొలిటికల్ గాను, సినిమాల విషయంలోనూ ఎప్పుడు హాట్ టాప్ గా కనిపించే బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య చందన ఇలాంటి చిన్న సిల్లీ కారణంతోనే ఆత్మహత్య చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. భర్త తో చట్నీ విషయంలో గొడవపడి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రమణ, బానోతు చందన(25)ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. రమణ కొన్నాళ్లుగా బండ్ల గణేష్ వద్ద డ్రైవర్ పనిచేస్తున్నాడు, రమణ భార్య చందన ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరూ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఇందిరానగర్ లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం నైట్ ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ విషయంలో భార్య భర్తల మధ్యన గొడవ జరిగినట్లుగా చెబుతున్నారు.
చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో గొడవపడగా, క్షణికావేశంలో చందన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడినట్లుగా చెబుతున్నారు. దానితో భర్త రమణను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.