ఏ భాషలో అయినా.. సినిమాల్లో కానీ, సీరియల్స్ లో కానీ నటిస్తే చాలు వాళ్ళకి విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది. వాళ్ళు బయటికి వస్తున్నారని తెలిస్తే చాలు అభిమానులు గుమ్మిగూడిపోతారు. కొంతమంది అభిమానులకి బయపడి పబ్లిక్ ఈవెంట్స్ కి చాలా అరుదుగా వస్తారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా ఏ భాషలో అయినా స్టార్ హీరోలు, హీరోయిన్స్ కనిపించే ఈవెంట్స్ కి అభిమానులు వేలల్లో హాజరవుతారు. కానీ తమిళనాట చెన్నైలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన కలైనర్ 100 ఈవెంట్ ఇప్పుడు అట్టర్ ప్లాప్ అవడం అటుంచి తమిళ సెలబ్రిటీస్ పరువు పోయేలా చేసింది.
కరుణానిధి శతజయంతి ఉత్సవం కలైనర్ 100 కోసం స్టాలిన్ ప్రభుత్వం ఓ రేంజ్ లో ఏర్పాట్లు చెయ్యడమే కాదు.. ఈ ఈవెంటుకి తమిళ సెలెబ్రిటీస్ అయిన రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, సూర్య, కార్తీ, ధనుష్, శివ కార్తికేయన్, నయనతార, కీర్తి సురేష్.. ఇలా టాప్ స్టార్స్ అందరిని ఇన్వైట్ చేసారు. మరి ఇంతమంది స్టార్స్ వస్తుంటే.. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉండాలి. అందుకు తగ్గట్టుగానే స్టాలిన్ ప్రభుత్వం 50 వేల సీట్ల కెపాసిటితో ఈవెంట్ ని నిర్వహించింది.
ఈ వేడుకకి విజయ్, అజిత్ తప్ప మిగతా స్టార్స్ అంటే కమల్ హాసన్, రజనికాంత్, సూర్య, కార్తీ, ధనుష్, శివ కార్తికేయన్, శివ రాజ్ కుమార్, నయనతార, కీర్తి సురేష్, వడివేలు, జీవా, జయం రవి, పార్తిబన్ ఇలా ఎందరో సెలబ్రిటీలు వచ్చారు. ఆ ఈవెంట్ కి 50 వేలమంది హాజరవుతారు అనుకుని ఏర్పాటు చేస్తే.. అక్కడ 1000 లోపు జనాలు కనిపించడం చూసి నిర్వాహకులు, స్టాలిన్ ప్రభుత్వం షాకైతే సెలబ్రిటీస్ కి ఎంతో అవమానంగా అనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అదునుగా విజయ్, అజిత్ ఫాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కలైనర్ 100 ఈవెంట్ అట్టర్ ప్లాప్ అంటూ ఖాళీ కుర్చీల వీడియోస్ ని ట్రెండ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.
వందల కుర్చీలు ఖాళీగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేయడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం, అక్కడ మాజీ ముఖ్యమంత్రి, కళాసేవ చేసిన ఒక దిగ్గజ కవి కరుణానిధి శతజయంతి ఉత్సవం కలైనర్ 100 అంటూ ఘనంగా ఏర్పాట్లు చేసి సెలబ్రిటీస్ ని ఆహ్వానిస్తే.. అక్కడికి అభిమానులు రాకపోగా.. కనీసం ప్రజలు కూడా హాజరు కాకపోవడం నిజంగా విచిత్రమే.