సంబరాల రాంబాబు అదేనండి మన అంబటి రాంబాబుకి ఇంత అవమానమా? అది కూడా సంక్రాంతికి ముందు.. అది కూడా తనకు సత్తెనపల్లి టికెట్ కేటాయించాక.. మంచి జోష్‌లో ఉన్నప్పుడా? సంక్రాంతి వస్తోందంటేనే అంబటి రాంబాబు సంబరాల రాంబాబు అయిపోతారు. ఈసారి వస్తుందా? రాదా? అనుకున్న సత్తెనపల్లి టికెట్‌ను కూడా తిరిగి ఆయనకే కేటాయించారు. ఈసారి సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి.. మన రాంబాబు రెచ్చిపోయి మరీ డ్యాన్సులు వేస్తారనుకుంటున్న తరుణంలో ఆయనకు ఘోర అవమానం జరిగింది. పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఆయనకు తీవ్ర స్థాయిలో నిరసన సెగ తగిలింది.
అసలేం జరిగిందంటే..
రోడ్డు ప్రమాదంలో మన్సూర్ అలీ అనే వ్యక్తి మరణించాడు. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు అంబటి రాంబాబు ముప్పాళ్ల వెళ్లారు. అప్పుడెప్పుడో రోడ్డు ప్రమాదం జరిగితే తీరిగ్గా ఇప్పుడొచ్చి పరామర్శలా? అంటూ బాధిత కుటుంబం అంబటి రాంబాబుపై ఫైర్ అయ్యింది. తాము లేనిదే వైసీపీ లేదని.. ఓట్లు వేసి గెలిపించిన మంత్రి ఇప్పుడెందుకు వచ్చాడంటూ మండిపడ్డారు. మరోసారి వచ్చాడంటే చెప్పులతో కొడతామని హెచ్చరించారు. విమర్శలు, బూతు పురాణం ఇలా ఒకటేమిటి.. జరగాల్సిన అవమానమంతా అంబటికి జరిగిపోయింది. పోలీసులు సర్ది చెప్పినా వినే పరిస్థితి లేకుండా పోయింది.
సమస్యలపై కన్నా.. సినిమాలపై స్పందించడం ఎక్కువైంది..
ఇక ఏమీ చేయలేక.. జరిగిన అవమానాన్ని తట్టుకోలేక మంత్రి అంబటి ముప్పాళ్ల నుంచి నిష్ర్కమించారు. మొత్తానికి ఈ విషయం ఏపీ అంతటా చర్చనీయాంశంగా మారింది. గెలుసు గుర్రాలకే అవకాశమని ప్రకటిస్తూ చాలా మందికి టికెట్ నిరాకరించారు ఏపీ సీఎం జగన్. మరి సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై చాలా వ్యతిరేకత ఉంది. ఆయన తన కోసం తప్ప జనాల కోసం చేసిందేమీ లేదని టాక్. పైగా సత్తెనపల్లి అంబటి రాంబాబు హయాంలో అభివృద్ధికి నోచుకోలేదు సరికదా.. మరింత అధ్వానంగా తయారైందని టాక్. అంతేకాకుండా అంబటి సమస్యలపై స్పందించడం కన్నా సినిమాలపై స్పందించడం ఎక్కువైందని కూడా అంటున్నారు. మొత్తానికి అంబటి ఇన్నాళ్లకు దొరికారు. జనం వారి కసంతా తీర్చుకున్నారు.