డిసెంబర్ 22 న విడుదలైన ప్యాన్ ఇండియా ఫిల్మ్ సలార్ మూవీ ఇంకా బాక్సాఫీసు వద్ద జోరుని కొనసాగిస్తుంది. ప్రభాస్ మాస్ కటౌట్ కి ప్రశాంత్ నీల్ హీరోయిజం ఎలివేషన్ కి ఆయన ఫాన్స్ మాత్రమే కాదు.. మాస్ ఆడియన్స్ సైతం సలార్ కి జై కొట్టారు. మొదటిసారి చూసినవారు యావరేజ్ అన్నవారే.. రెండుమూడుసార్లు సలార్ ని థియేటర్స్ లో వీక్షించి సలార్ అద్దిరిపోయింది అనే కామెంట్స్ విసురుతున్నారు, సలార్ కి చాలా చోట్ల రిపీటెడ్ ఆడియన్స్ కనిపిస్తున్నారు.
సలార్ హిట్ అవడంతో ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సలార్ 2 పై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. సలార్ 2 శౌర్యంగ పర్వంకి కావాల్సిన బజ్ అయితే క్రియేట్ అయ్యింది. అయితే సలార్ 2 మాత్రం ఇప్పుడప్పుడే పట్టాలెక్కే ఛాన్స్ లేదు అని అంటున్నా.. సలార్ 2 షూటింగ్ ఈ ఏడాది మొదలవుతుంది కానీ కొంత ఆలస్యమయ్యే అవకాశముంది అని తెలుస్తుంది. తమకు సెంటిమెంట్ గా కలిసి వస్తున్న నెలనే టార్గెట్ గా పెట్టుకుని 2025 డిసెంబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటామని తాజాగా నిర్మాత విజయ్ ఓ సందర్భంగా తెలియజేసారు.
ఇక సలార్ మొదటి భాగాన్ని మించిన ఎలివేషన్లు, డ్రామా, రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు సలార్ 2 లో ఉంటాయని నిర్మాత విజయ్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. సీజ్ ఫైర్ కేవలం పాత్రలను పరిచయం చేసిన ట్రైలరని, అసలు కథని శౌర్యంగ పర్వంలో చూస్తారని చెప్పడంతో ఒక్కసారిగా సలార్ 2 పై అంచనాలు మొదలైపోయాయి.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సక్సెస్ ని సైలెంట్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపై ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్యాన్ ఇండియా మూవీని మొదలు పెట్టేందుకు ప్రణాళికని సిద్ధం చేసుకుంటారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ ఎప్పుడెప్పుడు రెడీ అంటారా అని ఎదురు చూస్తున్నారు. అది ఈ వేసవికి మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు.