ఏంటో ఏమో కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు.. ఏపీలో వైసీపీ పతనం ఆరంభమైనట్టుగా అనిపిస్తోంది. అప్పటి నుంచి ఏపీ సీఎం జగన్‌కు ఏం చేయాలో పాలుపోక ఏదో ఒకటి చేసేయడం.. దీంతో నేతలు చిన్న చిన్నగా ధిక్కారస్వరం వినిపించేసి బయటపడటం జరగుతోంది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే జంప్ చేస్తారో తెలియని పరిస్థితి. తాజాగా ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ధిక్కార స్వరం వినిపించారు. పైగా ఆయన దళితులకు ఇప్పటి వరకూ ఎలాంటి న్యాయమూ చేయలేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఒక దళితుడిని వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేసిన నాడు కూడా ఎలాంటి ధిక్కార స్వరమూ వినిపించలేదు కానీ ఇవాళ మాత్రం జగన్‌పై ఫైర్ స్టార్ట్ అయిపోయింది.
మంచి, చెడ్డా జగన్ కనుక్కున్నారా?
పొద్దున లేస్తే నా బీసీలు.. నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూ ఉపన్యాసాలు దంచేసే జగన్ దళితుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి టికెట్ దక్కదని తెలుసుకున్న సిట్టింగ్‌లంతా జగన్‌పై యుద్ధం ప్రకటిస్తున్నారు. తమ పనితీరు సరిగా లేదని ఎలా అంటావని జగన్‌ను నిలదీస్తున్నారు. అసలు ఈ ఐదేళ్ల కాలంలో ఏనాడైనా తమకు చేరదీసి మంచి, చెడ్డా జగన్ కనుక్కున్నారా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఐ ప్యాక్ సర్వేలో పనితీరు సరిగా లేదంటూ ఎక్కువగా దళిత నియోజకవర్గంలోనే మార్పులు చేయాలా? అని నిలదీస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఏ ఐప్యాక్ సర్వేల ద్వారా టికెట్లు ఇచ్చారని టికెట్ దక్కని నేతలు నిలదీస్తున్నారు.
చెప్పి ఉంటే వారు సరిదిద్దుకునే వారు కదా?
నిజానికి సదరు ఎమ్మెల్యేల ఆవేదనలోనూ నిజముంది? పనితీరు బాగోలేకుంటే ముందుగానే పిలిపించి పని తీరు బాగోలేదు.. సరి చేసుకోవాలని హెచ్చరించాలి. అంతేకానీ టికెట్ ఇవ్వడానికి ముందు నీ పని తీరు బాగోలేదు కాబట్టి టికెట్ ఇవ్వడం లేదంటే ఎవరికైనా ఆగ్రహం వస్తుంది. ఎప్పటికప్పుడు ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు అయితే చేయించుకున్నారు. మరి అప్పుడే చెప్పి ఉంటే వారు సరిదిద్దుకునే వారు కదా? ఐదేళ్లలో ఒక్కసారి కూడా తమను పిలిచి జగన్ మాట్లాడింది లేదని మీడియా ముందే చెబుతున్నారు ఎమ్మెల్యేలు. అసలు పార్టీ పెద్దలు చెప్పినట్టే నడుచుకున్నామని.. అలాంటప్పుడు తనపై వ్యతిరేకత ఉంటే ఎవరిది బాధ్యత అని పూతలపట్టు ఎమ్మెల్యే బాబు ప్రశ్నిస్తున్నారు. ఇది స్ట్రాంగ్ పాయింటే..