పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారానికి దూరంగా ఉంది. ఈసారి కూడా బీజేపీయే రానుందని సర్వేలన్నీ మూకుమ్ముడిగా చెబుతున్నాయి. ప్రధాని మోదీ సైతం చాలా తెలివిగా అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి దాన్ని ఎన్నికల ప్రధాన అస్త్రంగా వినియోగించబోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో నిలవాలంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర కావల్సినంతగా నిధులు అయితే లేవని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ క్రౌడ్ ఫండింగ్‌కు తెరదీసింది. ఆన్‌లైన్ ద్వారా క్రౌడ్ ఫండింగ్‌ను చేపట్టింది. నిజానికి ఈ పార్టీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉంది. కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని ఏలింది.
వెయ్యి కోట్లు కూడా లేవు..
అలాంటి కాంగ్రెస్‌కు నిధుల కొరత ఏంటి? విరాళాలు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌కు విరాళాలు తగ్గిపయాయని తెలుస్తోంది. ఈ విరాళాలలో బీజేపీ టాప్ పొజిషన్‌లో ఉంది. ఈ పార్టీ వద్ద రూ.6 వేల కోట్లకు పైగా విరాళాల ధనం ఉంటే.. కాంగ్రెస్ దగ్గర కనీసం వెయ్యి కోట్లు కూడా లేవు. కేవలం రూ.8 వందల కోట్లు మాత్రమే ఉన్నాయి. ఎన్నికలకు ఇంత తక్కువ డబ్బుతో వెళితే చాలా కష్టం. దేశ వ్యాప్తంగా బీజేపీని ఈ డబ్బుతో ఎదుర్కోవడం అంటే అయ్యే పని కాదు. ఈ క్రమంలోనే క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది.
స్వరాజ్ ఫండ్ స్ఫూర్తిగా..
డొనేట్ ఫర్ ద కంట్రీ వెబ్ పోర్టల్‌కి 18యేళ్ళ నిండిన వారు నిధులను పంపవచ్చు. దీనికి పంపాలనుకునే వారు రూ. 138.. లేదంటే రూ.1380.. లేదంటే రూ.13,800 రూపాయల వరకూ విరాళంగా ఇవ్వొచ్చు. ఇక ఎవరికి వారు వారి స్తోమతను బట్టి పంపించినా కూడా కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తోంది. మహాత్మాగాంధీ 1921లో చేపట్టిన స్వరాజ్ ఫండ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ విరాళాల కార్యక్రమం చేపట్టినట్టుగా కాంగ్రెస్ చెబుతోంది. అయితే ఇండియా కూటమి తరుఫున సేకరిస్తే మంచి స్పందన రాబట్టవచ్చని కొందరు అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి ఫండ్స్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశముందని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ విరాళాల సేకరణ అంశం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది.