ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలపై చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. ఇక మీదట గెలుపు గుర్రాలకే టికెట్ అని ప్రకటించారు. సర్వేలు చేయించి మరీ గెలవరు అనుకున్న నేతలను నిర్దాక్షిణ్యంగా పక్కనబెట్టేస్తున్నారు. ఈ సారి దాదాపు 60 మంది సిట్టింగ్‌లకు వైసీపీ టికెట్ దక్కదని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జులను మార్చడం కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జుల మార్పిడి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈసారి టికెట్ దక్కకపోవచ్చంటూ ప్రచారం జరుగుతున్న నేతల లిస్ట్‌లో.. కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల పేర్లు కూడా ఉండటం గమనార్హం.
టికెట్ రాకున్నా జగనన్న వెంటే ఉంటా..
ఈసారి టికెట్ రాదంటున్న నేతల లిస్ట్‌లో రోజా పేరు కూడా ప్రముఖంగానే వినిపించింది. ఆమె కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తనకు కూడా టికెట్ రాదన్న సందేహంలోనే మాట్లాడినట్టుగా అనిపించాయి. టికెట్ రాకున్నా కూడా తాను జగనన్న వెంటే ఉంటానని.. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రోజా ఓ సందర్భంలో తెలిపారు. ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఇక ఆమెకు టికెట్ ఇవ్వనట్టేనని అంతా భావించారు. కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం రోజాకు నగరి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందట. స్వయంగా జగనే రోజాకు టికెట్ ఇస్తున్నట్టు తెలిపారట. తాడేపల్లిలో జగన్ వరుసగా అన్ని నియోజకవర్గాల నేతలనూ కలుస్తున్నారు. ఈ క్రమంలోనే రోజాకు టికెట్ విషయంలో హామీ ఇచ్చేశారట.
ఎక్కడ రాంగ్ మెసేజ్ వెళ్లిపోతుందోనని...
వైసీపీలో చేరినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీతో పాటు ఆ పార్టీల నేతలను ఇష్టానుసారంగా మాట్లాడుతూ.. ఫైర్ బ్రాండ్‌గా నేమ్ సంపాదించుకుంది రోజా. ప్రతిపక్షాలపై నోరేసుకుని పడిపోవడం దిట్ట. వైసీపీ అధినేత జగన్‌తో పాటు పార్టీలోని ఏ నేత గురించి విమర్శలు వచ్చినా.. రోజా ముందుగా మీడియా ఎదుట ప్రత్యక్షమవుతారు. తమ వాళ్లను వెనుకేసుకొస్తూ విపక్షాలపై విరుచుకుపడతారు. అలాంటి రోజాకు టికెట్ ఇవ్వకుంటే ఎక్కడ రాంగ్ మెసేజ్ వెళ్లిపోతుందోనని భయపడిన జగన్.. ఆమె విషయంలో గెలుపు గుర్రాల అంశాన్ని పక్కనబెట్టేశారని టాక్. ఇక ప్రతిరోజూ జగన్‌తో అయితే చాలా మంది నేతలు భేటీ అవుతున్నారు. మరి వారిలో టికెట్ ఎంతమందికి వస్తుందో.. ఎంతమందికి జగన్ హ్యాండ్ ఇస్తారో చూడాలి.