టీడీపీ ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక ముందు ఒక లెక్క అంటున్నారు జనం. కొన్ని అంశాలను బేస్ చేసుకుని రాబోయేది టీడీపీలో నారా లోకేష్ పిరియడ్ అని అంటున్నారు. టీడీపీని స్థాయించి అక్షరాలా 42 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకూ యువరక్తం చేతిలోకి అధికారం రాలేదు. అయితే ఈసారి రానుందని ఏపీ జనం చెప్పుకుంటున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో బాగా యాక్టివ్ అయిపోయిన విషయం తెలిసిందే. తన వారసుడిగా నారా లోకేష్‌ను చంద్రబాబు రాజకీయాల్లోకి ప్రవేశపెట్టిన సమయంలో ఆయనకు పెద్దగా అవగాహన లేదు. మాట్లాడే విధానమూ అంతంత మాత్రమే.
స్లిమ్ అవడంపై ఫోకస్ పెట్టారు..
జనంతో మాత్రం చక్కగా కలిసిపోయేవారు. అయితే మాట్లాడే విధానం రాదన్న ఒకే ఒక్క కారణంతో వైసీపీ నేతలంతా నారా లోకేష్‌ను పప్పు అంటూ ఎద్దేవా చేసే వారు. ఆయనను విపరీతంగా బాడీ షేమింగ్ చేశారు. ఆ తరువాత నారా లోకేష్ ముందుగా స్లిమ్ అవడంపై ఫోకస్ పెట్టారు. బాడీ షేమింగ్ చేసిన నేతలంతా నోరెళ్ల బెట్టి చూసేలా మారిపోయారు. ఆపై రాజకీయాలపై దృష్టి పెట్టారు. యువగళం యాత్రతో ఆయనలోని పరిపక్వత జనాలకు కొట్టొచ్చినట్టుగా తెలిసిందే. ఆపై చంద్రబాబు అరెస్ట్ తరువాత నారా లోకేష్ వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. పార్టీని సమన్వయం చేసుకుంటూనే ఢిల్లీలోని జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరిపి చంద్రబాబును బయటకు తీసుకొచ్చారు.
ఆ ప్రకటన చేశారంటే కాస్త అవాక్కయ్యే విషయమే..
ఇక తాజాగా చంద్రబాబు సైతం నారా లోకేష్‌ను అన్ని కార్యక్రమాల్లోనూ ముందు పెడుతున్నారు. యువగళం ముగింపు సభలో లోకేష్‌ను ముందు పెట్టి మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా నారా లోకేష్ చేసిన కొన్ని ప్రకటనలు కాబోయే సీఎం అని చెబుతున్నట్టుగా ఉందంటున్నారు ఏపీ జనం. ఈసారి టీడీపీ 150 స్థానాల్లో పోటీ చేయడం పక్కా అని చెప్పారు. ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించడమనేది కాస్త కష్టమే. జనసేన పొత్తు ఉన్నా కూడా ఆయన ఆ ప్రకటన చేశారంటే కాస్త అవాక్కయ్యే విషయమే. ఇక సీట్ల షేరింగే తప్ప అధికారం షేరింగ్ ఉండదని మీడియా సాక్షిగా చెప్పారు. ఇవే కాకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి జగన్‌కు ఎదురు నిలిచేది లోకేషేనని రాజకీయ వర్గాల్లో సైతం ప్రచారం జరుగుతోంది.