తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఇక ఏపీలో జరగాల్సి ఉంది. దీనికి రంగం సిద్ధమవుతోంది. ఇక్కడ ఎన్నికలకు మూడు నెలల పైనే సమయం ఉంది కానీ ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఈ క్షణమో.. మరో క్షణమో ఎన్నికలు అన్నట్టుగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జనసేన-టీడీపీలతో పాటు వైసీపీ కూడా నిత్యం జనంలో ఉండేలా కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. ఇక సీఎం జగన్ అయితే ఎంత వ్యతిరేకత వస్తున్నా కూడా సిట్టింగ్‌ల విషయంలో ఖరాఖండీగా వ్యవహరిస్తున్నారు. సర్వేలు నిర్వహించి గెలుపు గుర్రాలకే సీట్లు అంటున్నారు. ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీ సైతం దీనికేమీ తీసిపోలేదు.
చంద్రబాబు ఎందుకు కలవాల్సి వచ్చింది?
తాజాగా చంద్రబాబు.. బెంగళూరులో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి మాట్లాడటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన డీకే శివకుమార్‌ను చంద్రబాబు ఎందుకు కలవాల్సి వచ్చింది? ఇది యాధృచ్చికంగా జరిగిందా? లేదంటే కావాలనే వెళ్లి మాట్లాడారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ నుంచి కుప్పం వెళ్లే క్రమంలో చంద్రబాబు బెంగుళూరు ఎయిర్‌పోర్టులో ఆగారు. అక్కడ డీకే ఆయనకు కనిపించారు. ఆ వెంటనే చంద్రబాబు స్వయంగా డీకే వద్దకు వెళ్లారు. ఇద్దరూ కలిసి పక్కకు వెళ్లి సీక్రెట్‌గా మాట్లాడుకున్నారు. డీకేతో మాట్లాడాల్సిన అంత సీక్రెట్ విషయాలు ఏముంటాయనేది ఆసక్తికరంగా మారింది.
అందుకే రహస్య మంతనాలు జరిపారా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో డీకే పాత్ర అత్యంత కీలకం. కాంగ్రెస్ నేతలందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఆయనదే. అలాంటి వ్యక్తిని చంద్రబాబు ఎందుకు కలిశారు? అసలేం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మంచి సక్సెస్ సాధించాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓట్లు చీలకుండా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఎలాంటి అవకాశాన్ని వదలడం లేదు. ఇప్పుడు జగన్‌ను ఓడించడంలో భాగంగానే డీకే శివకుమార్‌తో చంద్రబాబు రహస్య మంతనాలు జరిపారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా డీకేతో చంద్రబాబు భేటీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.