ఏపీలో అధికార పార్టీ వైసీపీ తమ అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్‌ను ఖరారు చేసే పనిలో బిజీబిజీగా గడిపేస్తోంది. ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తైంది. ఈ రెండు రోజుల్లో జాబితా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 60 స్థానాల్లో ఇన్‌చార్జుల మార్పు ఖాయమై పోయినట్టేనని తెలుస్తోంది. వారి స్థానంలో కొత్తగా ఎవరిని రంగంలోకి దింపాలనే విషయంలో సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరిని మార్చేయడం జరిగింది. మరిన్ని స్థానాలకు ఇన్‌చార్జిలను ప్రకటించేందుకు రంగం సిద్ధమైపోయింది. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో తాజాగా సీట్ల ప్రకటన విషయమై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయమేదో తీసుకున్నట్టు సమాచారం.
సీట్ల ప్రకటనపై కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు వేగవంతం చేశారు. గురు, శుక్రవారాల్లో జాబితా ప్రకటించేలా ముందుకెళ్తున్నారు. దాదాపు 60 స్థానాల్లో కొత్త ముఖాలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని స్థానాలకు ఇంచార్జిలను మార్పు చేశారు వైసీపీ అధినేత జగన్. మరిన్ని స్థానాలకు ఇన్‌చార్జులను ప్రకటించే దిశగా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో జరిగిన సమావేశంలో సీట్ల ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 11 స్థానాలకు ఇన్‌చార్జుల మార్పునకు సంబంధించిన జాబితాను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం మలివిడత జాబితాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది.
పైకి మాత్రం అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నా..
సీటు ఇవ్వని నేతలను పిలిచి స్వయంగా జగనే మాట్లాడుతున్నారట. ఎందుకు ఇవ్వలేకపోతున్నామనేది వివరిస్తున్నారట. మళ్లీ పార్టీ అధికారంలోకి రాగానే మంచి ప్రాధాన్యమున్న పోస్టులో నియమిస్తామని భరోసా ఇస్తున్నారని సమాచారం. నిన్న అయితే కంప్లీట్‌గా అభ్యర్థుల ఎంపిక పైనే సీఎం కసరత్తు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పైకి మాత్రం అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నా కూడా పార్టీ గెలుపు కోసం పని చేస్తామని చెబుతున్నారు. కానీ టికెట్ రాకుంటే ఏంటనే దానిపై వైసీపీ నేతలు ఆలోచన అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నిన్నటి నుంచి సీఎం క్యాంప్ ఆఫీసు చుట్టూనే వైసీపీ నేతలంతా ప్రదక్షిణలు చేస్తున్నారు.